వలపువల విసిరి.. రూ.8లక్షలు దోచేసి
అమ్మాయిల గొంతుతో మాట్లాడి బురిడీ కొట్టించి.. అమాయకుడిని మోసం చేసిన సైబర్ ముఠా అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ
ఆదిలాబాద్‌టౌన్: అమ్మాయిల గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వలపు వలతో రూ.8లక్షలు స్వాహా చేసిన ఘరానా ముఠాను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. సోమవారం వన్‌టౌన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మీకాంత్ ఈ నెల 25న వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశాడు. తన వివాహాం కోసం బాధితుడు యూబ్యూబ్‌లో పరిశీలించగా కృష్ణవేణి అనే అమ్మాయి ఫొటోతో రూపావత్ శ్రావణ్‌కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మాలోత్ మంజీ అనే మోసగాడిని పరిచయం చేశాడు. ప్రధాన నిందితుడైన మంజీ కృష్ణవేణి పేరిట మహిళా గొంతుతో మాట్లాడి తాను ధనవంతురాలినని తన ఆస్తులు కోర్టులో ఉన్నాయని నమ్మించాడు. న్యాయవాదికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని తన వివాహాం తర్వాత ఆస్తులు, వ్యాపారాలను పూర్తిగా చూసుకోవాలని చెప్పాడు. ఈ క్రమంలో బాధితుడు విడుతల వారీగా మోసగాడికి రూ.8లక్షలను ఆన్‌లైన్‌లో పంపించాడు. తిరిగి డబ్బులివ్వాలని అడుగగా వారు నిరాకరించారు. దీంతో బాధితుడు మోసపోయినట్లుగా గ్రహించి సైబర్ విభాగం 1930కు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన వన్‌టౌన్ పోలీసులు సైబర్ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సూర్యాపేట జిల్లాకు పంపించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లుగా వివరించారు. వారిలో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రాంచంద్రాపూరం తండాకు చెందిన మాలోత్ మంజీ, భుక్యా గణేశ్, రూపావత్ శ్రావణ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.1.50లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రేంకుమార్, సైబర్ సెల్ ఎస్సై గోపీకృష్ణ, వన్‌టౌన్ ఏఎస్సై గోకుల్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, ఐటీ సెల్ కానిస్టేబుల్ అన్వేష్ తదితరులున్నారు.


