రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ క్రీడాకారుల ప్రతిభ
ఆదిలాబాద్: ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించిన రాష్ట్రస్థాయి వుషూ ఉమెన్స్ లీగ్ పోటీల్లో ఆరు పతకాలతో ప్రతిభ కనబరిచారు. సీనియర్ విభాగంలో ఆకోజివార్ శృతి బంగారు పతకం సాధించగా, జూనియర్ విభాగంలో ముంగటివారి ప్రజ్ఞ, వడ్నాల కీర్తన రజత పతకాలతో మెరిశారు. అలాగే జూనియర్స్ విభాగంలో రావుల అవంతిక కాంస్య పతకం సాధించగా, సబ్ జూనియర్స్ విభాగంలో సుంకు ఘనశ్రీ, కాంక్ష కాంస్య పతకాలు కై వసం చేసుకున్నట్లు మాస్టర్ వీరేశ్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంపై జిల్లా క్రీడా శాఖ అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.


