తాండూర్‌లో తెల్లకాకి దర్శనం
తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్‌లోని ఓ ఇంటి వద్ద ఇటీవల తెల్తరంగు హౌస్‌క్రో(దేశీయ కాకి) కనిపించింది. ఈ విషయమై హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ(హెచ్‌వైటీఐసీఓఎస్) సభ్యుడు, వన్యప్రాణి పరిరక్షకుడు శ్రీపతి వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో కొన్ని భాగాలు తెల్లగా ఉన్న కాకులు మాత్రమే కనిపించగా.. పూర్తి తెల్లకాకి కనిపించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకి ల్యూసిజం అనే అరుదైన జన్యు పరిస్థితిని కలిగి ఉంది. దీని వల్ల పక్షి రెక్కలు పూర్తిగా తెల్లగా మారినప్పటికీ కళ్ల రంగు సహజంగా ఉంది. అల్బినిజంలో కళ్లతో సహా శరీరమంతా తెల్లబడుతుంది. కానీ ల్యూసిజంలో కళ్లు సాధారణంగా ఉంటాయి. ఇదే రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా. సహజత్వానికి భిన్నంగా ఉన్న రూపం వల్ల ఇతర కాకులతో సంబంధాలు, సంతాన ఎంపిక ప్రభావితం కావడానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ చాలా తెలివైన కాకులు వాటి సామాజిక బంధాలు, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం వల్ల ఆ ఇబ్బందులను అధిగమిస్తాయి. తెల్లరంగు కాకి పెద్ద వయస్సు వరకు జీవించడం దాని అనుకూల సామర్థ్యానికి నిదర్శనమని వైష్ణవ్ తెలిపారు.


