కన్నతల్లి కాదనుకుంది..!
కాగజ్‌నగర్‌టౌన్: నవమాసాలు కడుపున మోసింది.. బిడ్డను భూమి మీదకు తెచ్చేందుకు పురిటి నొప్పులు తట్టుకుంది. ఏమైందో ఏమోగాని పొత్తిళ్ల పాలు తాగుతూ సేదతీరాల్సిన పసికందును ఆ తల్లి కాదనుకుంది. రైలులో ఓ ప్రయాణికుడికి అప్పగించి దిగి వెళ్లిపోయింది. దీంతో రెండు నెలల ప్రాయంలోనే ఆ పసికందు మాతృప్రేమకు దూరమైంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ నుంచి పాట్నాకు వెళ్తున్న ధానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని వెనుకవైపు ఉన్న జనరల్ బోగీలో గుర్తు తెలియని మహిళ సుమారు రెండు నెలల వయస్సు ఉన్న పాపతో కాజిపేట రైల్వే స్టేషన్ వరకు వచ్చింది. మళ్లీ వస్తానని చెప్పి ఓ ప్రయాణికుడికి పాపను అప్పగించి కిందికి దిగింది. రైలు కదిలినా సదరు మహిళ రాకపోవడంతో పెద్దపల్లి రైల్వేస్టేషన్ వరకు చూసిన అతడు కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. వారు ఆ పాపను సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో అప్పగించాలని సూచించారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు పాపను తమ ఆధీనంలోకి తీసుకోని జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్‌కు విషయం తెలియజేశారు. వెంటనే జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది స్టేషన్‌కు చేరుకుని పాపను ఆసిఫాబాద్‌లోని బాలరక్ష భవన్‌కు తరలించారు. అక్కడి నుంచి జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్‌లోని శిశు సంక్షేమ గృహానికి తీసుకెళ్లారు. చట్టబద్ధంగా శిశుగృహం ద్వారా పాపను దత్తత ఇస్తామని ఆయన తెలిపారు. బాల రక్షభవన్ సిబ్బంది శ్రవణ్‌కుమార్, జమున, చంద్రశేఖర్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


