మనమూ చేద్దాం... మారథాన్
మామడ: నేటి పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం కారణంగా శరీరానికి వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడితో మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. నడక, జాగింగ్, రన్నింగ్ చేయడం మర్చిపోతే పనిఒత్తిడి వలన ఆందోళన, చికాకుతో పాటు బీపీ, షుగర్ వ్యాధుల బారినపడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతీరోజు క్రమం తప్పకుండా నడవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు. దీంతో నిర్మల్ జిల్లాలో వాకింగ్, మారథాన్, యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు..
ఇంగ్లండ్‌కు చెందిన రన్నర్ జాక్ సెయింట్ ఇటీవల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లు మారథాన్ చేపట్టారు. ఇటీవల నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకోగా మారథాన్ రన్నర్‌ల బృందం ఆయనకు ఘనస్వాగతం పలికింది. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పటికీ దానిని అధిగమించాల న్న ధృడసంకల్పంతో మారథాన్ చేస్తున్నట్లు తెలి పారు. 60 రోజుల పాటు రోజుకు 60 కిలోమీటర్ల దూరం పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
యువత ఆసక్తి...
సుదీర్ఘ దూరం నడకను మారథాన్‌గా పేర్కొంటారు. 42.196 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 6 గంటల్లో, 21 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల సమయంలో పూర్తి చేస్తారు. మారథాన్‌లో పాల్గొనడం శ్రమ అనుకుంటే 10 కి.మీ, 5కి.మీ, 3 కి.మీల క్లబ్‌లలో చేరుతున్నారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాలకు చెందిన రన్నర్‌లు హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, తదితర పట్టణాల్లో నిర్వహిస్తున్న మారథాన్ పోటీలలో పాల్గొంటున్నారు.


