సమరం!
గుడుంబాపై
పోలీసులకు సమాచారం ఇస్తాం
గుడుంబాకు బానిసలైన వ్యక్తుల జీవితాలు నాశనం అవుతున్నాయి. కర్జి గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి గుడుంబాకు బానిసై ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీంతో యువకులం ఏకమై గ్రామంలో గుడుంబాను నిషేధించాలని ప్రతిజ్ఞ చేశాం. గ్రామంలో గుడుంబా విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇస్తామని హెచ్చరించాం.
– మధుకర్, కర్జి, మం.దహెగాం
నిషేధిస్తూ తీర్మానం చేశాం
మద్యానికి బానిసలుగా మారడంతో ఆర్థికంగా నష్టపోవడంతోపాటు కుటుంబ కలహాలకు దారి తీస్తుంది. గ్రామంలో శనివారం సమావేశమై మద్యపానం నిషేధించాలని తీర్మానం చేశాం. ఎవరైనా మద్యం, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తే వారికి రూ.50 వేల జరిమానా విధిస్తాం. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను మూడు రోజుల్లో అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చాం.
– బోరే నగేశ్, రాంపూర్, మం.దహెగాం
నేరాలకు పాల్పడే అవకాశం
మురుగునీరు, వివిధ కుళ్లిన పదార్థాలతో గుడుంబా తయారు చేస్తారు. మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో గుడుంబా అమ్మితే కేసులు నమోదు చేస్తాం. తయారీ కేంద్రాల సమాచారం ఉంటే పోలీసులకు అందించాలి.
– వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్
దహెగాం/కౌటాల: విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం, గుడుంబా, ఇతర మత్తు పదార్థాలు గ్రామాల్లో అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. ఆర్థికంగా కుటుంబాలు ఛిన్నాభిన్నం కావడమే కాకుండా మత్తులో యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సకల సమస్యలకు కారణమైన గుడుంబాపై పల్లెల్లోని యువత, మహిళలు యుద్ధం ప్రారంభించారు. కుటుంబాలను విచ్ఛినం చేస్తున్న గడుంబా, ఇతర మత్తు పదార్థాలను నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. కర్జి గ్రామంలో ఇటీవల జునుగరి రాజన్న గుడుంబాకు బానిసై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానికులు ముందుకొచ్చి ఈ నెల 22న గ్రామంలో గుడుంబా అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించి, నిషేధానికి తీర్మానం చేశారు.
కేసులు నమోదు చేస్తున్నా..
జిల్లాలో గుడుంబా కట్టడికి పోలీసుశాఖ విస్తృతంగా దాడులు చేస్తూ.. నిందితులపై కేసులు నమోదు చేస్తోంది. అయినా కొందరు మారుమూల అటవీ ప్రాంతాలను అడ్డాలు మార్చుకుంటూ నాటుసారా తయారు చేస్తున్నారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి 200 మందిపై కేసులు నమోదు చేశారు. 1200 లీటర్లకు పైగా నాటుసారా, రెండు వేల కిలోలకు పైగా బెల్లం, పటికను పట్టుకున్నారు. పలు వాహనాలను సైతం సీజ్ చేశారు. శనివారం కాగజ్‌నగర్ మండలం తుంగమడుగులో పోలీసులు 20 లీటర్ల గుడుంబా, మరో మూడు వేల లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. 30 కిలోల బెల్లం, పట్టికను పట్టుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే పూర్తిస్థాయిలో గుడుంబా నిర్మూలన సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు.
సమరం!
సమరం!
సమరం!


