‘బెజ్జూర్’లో అవినీతి.. మంచిర్యాలలో ఏసీబీ దాడి
బెజ్జూర్(సిర్పూర్): బెజ్జూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఏసీఎస్ కార్యదర్శి నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ జిల్లా ఇన్‌చార్జి సహకార అధికారి(డీసీవో) రాథోడ్ భిక్కునాయక్ ఏసీబీకి చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. బెజ్జూర్ పీఏసీఎస్‌లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో వెంకటేశ్వర్‌గౌడ్ అవినీతి కి పాల్పడ్డారని సంఘ డైరెక్టర్లు గతేడాది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం సహకార సంఘంలో రూ.1.24 కోట్ల నిధులు పక్కాదారి పట్టినట్లు నిర్ధారించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు కార్యదర్శిని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడంతోపాటు పెండింగ్ వేతనాలు ఇప్పించేందుకు వెంకటేశ్వర్‌గౌడ్ నుంచి డీసీవో భిక్కునాయక్ రూ.7లక్షల లంచం డిమాండ్ చేశాడు. మొదటి దఫా రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని, వెంకటేశ్వర్‌గౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వల పన్ని శనివారం మంచిర్యాలలోని ఎక్బాల్ హైమద్‌నగర్‌లో అద్దెకుంటున్న రాథోడ్ భిక్కునాయక్ ఇంట్లో లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. బెజ్జూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవినీతి ఆరోపణలతో ఒకరు సస్పెండ్ కాగా మరో జిల్లా అధికారి ఏసీబీకి పట్టుపడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.


