ఎస్‌ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితాను మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించామన్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.33 కోట్ల ఓటర్లను మ్యాపింగ్ చేశామని వివరించారు. మొదట మ్యాపింగ్ చేసిన కేటగిరీ ఏ జాబితాను బీఎల్‌వో యాప్ ద్వారా నిర్ధారించుకోవాలని, అనంతరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్‌లో నమోదు చేస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కేటగిరీల వారీగా బూత్‌స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు, సంబంధిత అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చామన్నారు. సహాయ ఎన్నికల అధికారి సమక్షంలో రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎన్నికల పర్యవేక్షకులు శ్యాంలాల్ తదితరులు పాల్గొన్నారు.


