
స.హ చట్టం వజ్రాయుధం లాంటిది
రెబ్బెన: సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని బెల్లంపల్లి ఏరి యా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నా రు. శనివారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జీఎం మాట్లాడుతూ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టమే సమాచార హక్కు చట్టమన్నారు. ప్రతీఒక్కరు ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అయితే ఈ చట్టాన్ని సమాజ ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని, స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని సూచించారు. వ్యక్తుల వ్యక్తిగత సమాచారం, దేశ రక్షణ రహస్యాల విషయంలో ఈ చట్టం ద్వారా సమాచారాన్ని పొందలేమన్నారు. చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఎస్వోటూ జీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్ కుమార్, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, ఏఐటీయూసీ నాయకుడు కిరణ్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.