మహాలక్ష్మి కళ | - | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మి కళ

Jul 25 2025 4:48 AM | Updated on Jul 25 2025 4:48 AM

మహాలక

మహాలక్ష్మి కళ

● ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు ● కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు ● సర్వీసుల సంఖ్య పెంచాలని విన్నపం ● ఆసిఫాబాద్‌ డిపోకు రూ.48.86 కోట్ల ఆదాయం

ఆసిఫాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు పథకాన్ని జిల్లాలోని మహిళలు పెద్దసంఖ్యలో సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాలో ఈ పథకాన్ని 2023 డిసెంబర్‌ 9న ప్రారంభించగా, అప్పటి నుంచి ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు పెద్దఎత్తున వినియోగించుకోవడంతో ఆసిఫాబాద్‌ డిపోకు అదేస్థాయిలో ఆదాయం సైతం సమకూరుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని 200 కోట్ల మహిళలు వినియోగించుకున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో మహాలక్ష్మి సంబురాలు నిర్వహించారు. డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి రాంచందర్‌, డీఎం రాజశేఖర్‌ ఆధ్వర్యంలో మహిళా ప్రయాణికులను సన్మానించారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు లేక ఖర్చులకు సరిపడా ఆదాయం వచ్చేది కాదు. ఉచిత బస్సు సౌకర్యంతో ప్రస్తుతం కెపాసిటీకి మించి ప్రయాణిస్తున్నారు.

రూ.48.86 కోట్ల ఆదాయం

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో 83 బస్సు సర్వీసులు ఉన్నాయి. 75 బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. వీటిలో రెండు లహరి, 13 లగ్జరీ, రెండు డీలక్స్‌, ఎనిమిది ఎక్స్‌ప్రెస్‌, మరో 28 హైర్‌ బస్సులు ఉండగా, మిగితావి ఆర్డీనరీ సర్వీసులు. ప్రతిరోజూ డిపోకు ఆదాయం రూ.20 లక్షలు కాగా, అన్‌సీజన్‌ కావడంతో ప్రస్తుతం రూ.18 లక్షల వరకు సమకూరుతోంది. ఏప్రిల్‌, మే నెలల్లో ప్రతిరోజూ ఆదాయం రూ.20 లక్షల టార్గెట్‌ను అందుకుంది. ప్రతిరోజూ 47 వేల మంది ప్రయాణికులను 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు తరలిస్తున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో పరిధిలో 1.62 లక్షల మంది మహిళలు ప్రయాణించగా, రూ.48.86 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో డిపో ఆదాయం లక్ష్యానికి దూరంగా ఉండగా, ఉచిత బస్సుతో గణనీయమైన ఆదాయం వస్తోంది. కేవలం ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు నడుస్తుండగా, రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సులు వెళ్లడం లేదు. గ్రామీణ మహిళలకు మహాలక్ష్మి పథకం దూరమవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలు, ప్రైవేటు వాహనాలను వారు ఆశ్రయిస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులకు ప్రతిపాదన

మహాలక్ష్మి పథకంతో మహిళలు ఆర్టీసీ బస్సు సేవలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. డిపో ఆదాయం సైతం గతంతో పోలిస్తే పెరిగింది. జిల్లా కేంద్రం నుంచి ఆదిలాబాద్‌ రూట్‌లో నాలుగు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించాం. ప్రయాణికుల సౌకర్యం కోసం చర్యలు తీసుకుంటున్నాం.

– రాజశేఖర్‌, ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డీఎం

కిటకిటలాడుతున్న బస్సులు

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో 68 శాతం మహిళలు ప్రయాణిస్తున్నారు. మహిళలకు కేవలం ఎక్స్‌ప్రెస్‌, ఆర్డీనరీలో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. కొన్ని రూట్లలో బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆర్డీనరీ బస్సుల్లో మహిళల సంఖ్య పెరగడంతో పురుషులకు సీట్లు సరిపోవడంతో లేదు. టికెట్‌ చెల్లించే పురుష ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

మహాలక్ష్మి కళ1
1/1

మహాలక్ష్మి కళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement