
ఎడతెరిపిలేని వర్షం
ఆసిఫాబాద్/చింతలమానెపల్లి/కౌటాల: జిల్లాలో వర్షం తెరిపిలేకుండా కురుస్తోంది. వరదలతో రోడ్లు కొట్టుకుపోగా, పంట చేలలోకి నీరు చేరింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లాలో 64.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బెజ్జూర్‌లో అత్యధికంగా 239.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, చింతలమానెపల్లిలో 197.2 మి.మీ.లు, కౌటాల 112.3, పెంచికల్‌పేట్ 99.1, దహెగాం 54.9, సిర్పూర్(టి) 50.6, లింగాపూర్ 32.9, తిర్యాణిలో 30.3 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షంతో ఆసిఫాబాద్ మండలంలోని కుమురంభీం ప్రాజెక్టులోకి వరద చేరుతోంది. ప్రాజెక్టు ఐదో గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. గరిష్ట నీటిమట్టం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 237.40 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో 1039 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1039 క్యూసెక్కులు ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వార్దా, వైన్‌గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చింతలమానెపల్లి మండలంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదు సెం.మీ.ల వర్షం కురిసింది. గూడెం మార్గంలో గురువారం ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. దిందా, శివపెల్లి, నాయకపుగూడ వాగుల్లో ఉధృతి తగ్గకపోవడంతో ఆయా గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బూరెపల్లి, రణవెల్లి, గంగాపూర్, కారెబ్బెన, గూడెం, దిందా, ఖర్జెల్లి, కోయపెల్లి, బూరుగూడ సమీపంలోని వాగులు ఉప్పొంగడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గూడెం, శివపెల్లి గ్రామాల శివార్లలో పత్తి చేలలో బురద పేరుకుపోయి ఇసుక, రాళ్లు మేటలు వేశాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గూడెం, బెజ్జూర్ మార్గంలో కోయపెల్లి సమీపంలో కల్వర్టు, రహదారి కొట్టుకుపోయింది. కోయపెల్లి, నాగెపెల్లి గ్రామాల మధ్య వంతెనకు ఇరువైపులా కోతకు గురైంది. ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతులు నిర్వహించడం గమనార్హం. బెజ్జూర్ నుంచి గూడెం మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. కౌటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోకి మెట్ల ద్వారా వర్షపు నీరు చేరింది. వార్దా, వైన్‌గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ప్రమోద్ సూచించారు. నదుల వద్దకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు.
కుమురంభీం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో

ఎడతెరిపిలేని వర్షం

ఎడతెరిపిలేని వర్షం