గిరి గ్రామాల్లో అక్షర చైతన్యయాత్రలు
● ఆదివాసీలతో అక్షరాలు దిద్దించిన ఉపాధ్యాయుడు ● సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్న సుందిళ్ల రమేశ్
కెరమెరి(ఆసిఫాబాద్): చిన్నారులతో పాటు అత్యంత వెనుకబడి అక్షరజ్ఞానం లేని పేదలు, ఆదివాసీల జీవితాల్లో అక్షర కాంతులు వెలిగించేందుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుందిళ్ల రమేశ్ ఎంతగానో కృషి చేస్తున్నారు. వేసవి సెలవుల్లో విహార యాత్రలు, దైవదర్శనాలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లకుండా పేదల గుడిసెలకు వెళ్లి అక్షరాలు దిద్దించారు. కాగజ్‌నగర్ మండలంలోని చారీగాం మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న రమేశ్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
14 మండలాల్లో ఒక్కో గ్రామం..
తనకు వచ్చిన ఆలోచనను జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు తెలిపి ఆయన సహాయం తీసుకున్నారు. తాను చేపట్టే కార్యక్రమాలను పూర్తిగా విశదీకరించి అధికారుల అనుమతి పొందారు. జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి పర్యవేక్షణలో జిల్లాలోని ప్రతీ మండలంలో ఉన్న అత్యంత వెనుకబడిన గ్రామాన్ని ఎన్నుకుని ‘అక్షర చైతన్య యాత్ర’ పేరిటా అక్కడి ప్రజలకు అక్షరం విలువ తెలియజేశారు. అనంతరం వారితో అక్షరాలు దిద్దించారు. బాల్యవివాహాలు నిరోధించడం, బాలకార్మికుల నిర్మూలన, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం, ఆరోగ్య నియమాలు పాటించడం, ఓటుహక్కు వినియోగం, వన్యప్రాణులను రక్షించడం, మూఢనమ్మకాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ పాటించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సద్వినియోగం ఇతర సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ఇప్పటికే జిల్లాలోని కాగజ్‌నగర్ మండలంలోని మానిక్‌పటార్, తిర్యాణి మండలం గుండాల, దహెగాం మండలం మోట్లగూడ, పెంచికల్‌పేట్ మండలం మురళిగూడ, బెజ్జూర్ మండలం తలాయి, చింతలమానెపల్లి మండలం ఆడేపల్లి, కౌటాల మండలం గిన్నెలహెట్టి, సిర్పూర్(టి) మండలం పూసుగూడ, ఆసిఫాబాద్ మండలం పాడిబండ, వాంకిడి మండలం నవేగాం, జైనూర్ మండలం కిషన్‌నాయక్‌తండా, సిర్పూర్(యూ) మండలం పవార్‌గూడ, లింగాపూర్ మండలం కంచెన్‌పల్లి గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించారు.
నేడు జోడేఘాట్‌కు వెంకట్‌రెడ్డి రాక
గత నెల 6న ప్రారంభమైన అక్షర చైతన్యయాత్ర సోమవారం ముగియనుంది. కెరమెరి మండలంలోని జోడేఘాట్‌లోని కుమురంభీం మ్యూజియంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ సలహాదారుడు వెంకట్‌రెడ్డితో పాటు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్భూగుప్తా, డీఈవో యాదయ్య, డీడీ రమాదేవి, డీఎంహెచ్‌వో సీతారాం హాజరుకానున్నారు.
గిరిజనుల్లో మార్పు కోసం
ప్రతీ వ్యక్తికి అక్షరజ్ఞానం అవసరం. కానీ చాలా గ్రామాల్లో ఆదివాసీలు నేటికీ నిరక్షరాస్యులుగానే ఉన్నారు. అలాంటి వారికి ఎంతో కొంత అవగాహన కల్పించాలని అక్షర చైతన్యయాత్రలు ప్రారంభించాం. 15 మండలాల్లో 90శాతం కనీస సౌకర్యాలు లేని, అధికారులు పర్యటించని గ్రామాలను గుర్తించి వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించాం. మనిషి వెనుకబాటుతనానికి అక్షరజ్ఞానం లేకపోవడమే కారణం అని గ్రహించి ఆ దిశగా కార్యచరణ చేపట్టాను. ఈ యాత్రలు ఎంతో సంతోషాన్నిచ్చాయి.
– సుందిళ్ల రమేశ్, ఉపాధ్యాయుడు
గిరి గ్రామాల్లో అక్షర చైతన్యయాత్రలు


