
పాత స్టేషన్.. నయా కిడ్స్‌జోన్
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి పోలీస్ స్టేషన్ నూతన భవనంలోకి మారిన తర్వాత పాత భవనం సీఐ కార్యాలయంగా కొనసాగిస్తున్నారు. అక్కడ ఖాళీగా ఉన్న గదులు, హాల్ పిల్లలకు ఉపయోపడాలనే ఉద్దేశంతో ఏఎస్పీ చిత్తరంజన్ సరికొత్త ఆలోచన చేశారు. చిన్నారులను ఆకర్శించేలా హాల్‌లో ఆట వస్తువులు, బొమ్మలు, బెలూన్స్ ఏర్పాటు చేసి కిడ్స్ జోన్‌గా రూపొందించారు. చెస్, క్యారమ్, కిక్ బాక్సింగ్ కిట్, బాల్స్ టబ్, జారుడు బల్ల, తదితరాలు అందుబాటులో ఉంచిన ఈ కిడ్స్‌జోన్ ను సీఐ సత్యనారాయణతో కలిసి ఏఎస్పీ సోమవా రం ప్రారంభించారు. ఏఎస్పీ మాట్లాడుతూ పోలీస్ క్వార్టర్లలో నివాసం ఉంటున్న పిల్లలకు ఆటలాడుకునేందుకు సరైన వసతులు లేకపోవడంతో ఎస్పీ ఆదేశాల మేరకు పాత పోలీస్‌స్టేషన్ భవనంలో కిడ్స్ జోన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 15 మంది చిన్నారులకు ఉపయోగపడేలా ఆట వస్తువులు అందుబాటులో ఉంచామన్నారు. పిల్లలు ఒకేచోట ఆడుకోవడం, వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల వారిలో స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. తిర్యాణి మండలంలోని పాత పోలీస్ స్టేషన్ భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి విద్యార్థులు వినియోగించుకునేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్సైలు ప్రశాంత్, మధుకర్, ఏఎస్సై పోశెట్టి, సిబ్బంది పాల్గొన్నారు.

పాత స్టేషన్.. నయా కిడ్స్‌జోన్