
పోడు సాగు అడ్డుకోవడం అన్యాయం
● సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
పెంచికల్‌పేట్(సిర్పూర్): పెంచికల్‌పేట్ మండలం జైహింద్‌పూర్ గ్రామ శివారులో సోమవారం అటవీశాఖ అధికారులు పోడు భూములను దున్ని చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడుతున్నారనే విషయం తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోడు రైతులతో మాట్లాడారు. కొత్తగా అటవీ భూమిని ఆక్రమించవద్దని పేర్కొన్నారు. పోడు రైతులను ఇబ్బంది పెట్టి వారి జీవనోపాధికి అంతరాయం కలిగించవద్దని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. రెండు రోజుల క్రితం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ సంవత్సరం ఫారెస్ట్ ల్యాండ్ రిట్రీవల్ పేరిట పోడు భూముల్లో మొక్కలు నాటేది లేదని ఫారెస్ట్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దానికి అనుగుణంగా అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని పోడు రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, అండగా నిలిచి పంటల సాగుకు సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.