
శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో సోమవారం లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణ ప్రారంభానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి నూతన ఆర్‌వోఆర్ చట్టంలో సర్వేయర్ల పాత్ర కీలకమైందన్నారు. చట్టంతోపాటు భూమి కొలతల్లో ప్రతీ అంశంపై అవగాహన ఉండాలని సూచించారు. వారసత్వ పాలు పంపకాలు, కొనుగోలు పట్టాల మార్పిడిలో సర్వేయర్లు మోకాపైకి వెళ్లి కొలతలు తీసి నక్ష సమర్పించడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు ఉండవన్నారు. 50 రోజులపాటు శిక్షకులు నేర్పించే అంశాలపై పట్టుసాధించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా భూమి కొలతల అధికారి సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.