
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కాగజ్‌నగర్‌టౌన్: రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణల్లోని స్టాక్ రిజిస్టర్ వివరాలు, రసీదు పుస్తకాలు పరిశీలించారు. అనంతరం మా ట్లాడుతూ దుకాణాల్లో ఎరువులు, విత్తనాల ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని సూచించారు. సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రతిరోజూ దుకాణాలను వ్యవసాయాధికారులు తనిఖీ చేసి, నివేదికలు అందించాలని సూచించారు.
ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి
ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్, ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లుల పేరిట ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి, మాతృమూర్తులను గౌరవించుకుందామన్నారు. పట్టణాల్లో గుర్తించిన చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
అర్హులను ఎంపిక చేయాలి
రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులను ఎంపిక చేసి, జిల్లాస్థాయి కమిటీకి పంపించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2 నాటికి అర్హులకు మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. అనంతరం మున్సి పల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, తహసీల్దార్ కిరణ్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ మోతీరాం, అమృత మిత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వివరాలు పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే