
‘కార్మికులకు అన్యాయం చేస్తున్న గుర్తింపు సంఘం’
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో కార్మికులపై అధిక పనిభారం మోపుతున్నా.. కనీసం స్పందించకుండా గుర్తింపు సంఘం కార్మికులకు అన్యాయం చేస్తోందని హెచ్‌ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు అన్నారు. కైరిగూడ ఓసీపీలో శుక్రవారం హెచ్‌ఎంఎస్ నాయకులు పర్యటించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మేనేజర్ శంకర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏరియాలో ఐఈడీ ప్రకారం కార్మికుల సంఖ్య తక్కువగా ఉందని, విరమణ పొందిన వారి స్థానంలో కొత్తవారిని నియమించడం లేదన్నారు. ఇచ్చిన హామీలు మర్చి పోయి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈపీ ఆపరేటర్లు ఏ గ్రేడ్ వాహనాలు నడుపుతున్నందున ఖాళీలతో సంబంధం లేకుండా ఏ గ్రేడ్ పదోన్నతులు కల్పించాలన్నారు. ఓసీపీలో టెక్నీషియన్ల కొరతను నివారించాలని, బదిలీపై వచ్చిన సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్‌లకు ఆర్థికనష్టం జరగకుండా బేసిక్, కేటగిరీ ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా ఆర్గనైజర్ ఎస్‌కే ఇనూష్, ఫిట్ కార్యదర్శి రామకృష్ణ, ఎస్‌అండ్‌పీసీ ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి కిష్టస్వామి, ఆర్గనైజర్ బొట్ల కిష్టస్వామి పాల్గొన్నారు.