గనులకు కన్నం.. సర్కారుకు సున్నం..! | - | Sakshi
Sakshi News home page

గనులకు కన్నం.. సర్కారుకు సున్నం..!

May 12 2025 12:21 AM | Updated on May 12 2025 12:21 AM

గనులకు కన్నం.. సర్కారుకు సున్నం..!

గనులకు కన్నం.. సర్కారుకు సున్నం..!

జిల్లా వివరాలు

కౌటాల మండలం ముత్యంపేట్‌లోని ఓ క్వారీ

జైనూరు మండలంలో ఉన్న దుక్రే సుభాష్‌ క్వారీ నుంచి 20 సంవత్సరాల నుంచి అనుమతులకు మించి కంకరను వెలికి తీసి భారీగా ఆర్జించారు. గనుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా వ్యవహారం బయటపడింది. 80 వేల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వినట్లు తనిఖీలో తేలింది. సంబంధిత క్వారీ యజమానికి రూ.2 కోట్ల జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో అప్పీలుకోసం కోర్టుకు వెళ్లాడు.

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో ఖనిజాల అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. తవ్వకాలు ఎక్కువగా జరిపి తక్కువ మొత్తం ఖనిజానికి రాయల్టీని చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం తాజాగా ఈ విధానంలో మార్పులు చేపట్టి నిబంధనలు మరింత పదునెక్కించాలని చూస్తోంది.

కంకర క్వారీల రాయల్టీ చెల్లింపు పరిస్థితి...

ప్రతీ టన్ను కంకరకు ప్రభుత్వానికి రూ.139 రాయల్టీ చెల్లించాలి. జిల్లాలో 7 కంకర క్వారీలు, 4 క్రషర్లు ఉన్నాయి. అన్ని గనుల నుంచి అనధికారిక అంచనా ప్రకారం రోజుకు 1000 నుంచి 2000 టన్నుల వరకు కంకర బయటకు వస్తోంది. ఈలెక్కన ప్రతీరోజు ప్రభుత్వానికి రూ.1.39 లక్షల నుంచి రూ.2.78 లక్షలు రావాల్సి ఉంది. కానీ అంతగా రావడం లేదు. గతంలో 2021–22 నుంచి 2023–24 సంవత్సరాల మధ్య జిల్లాలోని వివిధ గనుల నుంచి వెలికితీసే ముడి ఖనిజాన్ని 363 జాతీయ రహదారి పనులకు వినియోగించగా.. ఆ సమయంలో సీనరేజ్‌తో పాటు ఇతర పన్నులు కలిపి రూ.10.80 కోట్లకుపైగా రాయల్టీ రూపంలో వసూలైంది. ప్రస్తుతం ఆ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 32,632 మెట్రిక్‌ టన్నుల ముడి ఖనిజం వెలికితీయగా ఇందుకు రాయల్టీ, ఇతర ఫీజుల రూపంలో సర్కారుకు రూ.31.74 లక్షల ఆదాయం వచ్చింది.

టన్నుకు చెల్లించాల్సిన రాయల్టీ : 139

రోజుకు వివిధ తవ్వకాలు : 1000–2000 టన్నులు

నామమాత్రంగా రాయల్టీ చెల్లింపు

జిల్లాలో యథేచ్ఛగా ఖనిజాల తవ్వకాలు

జరిమానా విధించాం..

జిల్లాలో ఖనిజాలను తవ్వి ఫీజులు చెల్లించకుండా లావాదేవీలు జరుపుతున్న లీజుదారులపై రూ.2 కోట్ల జరిమానా విధించాం. కేవలం ఇదంతా తనిఖీల ద్వారానే జరిగింది. తరచూ గనులకు వెళ్లి తనిఖీలు జరుపుతూనే ఉన్నాం. తొమ్మిదేళ్లలో రూ.12.33 కోట్ల ఆదాయం సమకూరింది.

– ఎస్‌.గంగాధరరావు,

గనుల శాఖ ఏడీ, ఆసిఫాబాద్‌

అక్రమంగా తరలింపు

జిల్లాలో జరిగే ఇతర పనులకు, పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే ముడి ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. సాంకేతికంగా ఒక లారీ లోడుకు ఫీజు చెల్లించి అదే రశీదులో నాలుగైదు ట్రిప్పుల లోడ్లు తరలివెళ్తున్నట్లు సమాచారం. ఇలా ఫీజులను చాలా వరకు ఎగ్గొడుతున్నారు. అక్రమ రవాణా ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మూడింతలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రైల్వే, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖ పనులకు సైతం ఇక్కడి గనుల నుంచే ముడి ఖనిజాన్ని తరలిస్తున్నారు. వీటి నుంచి డీఎంఎఫ్‌టీ, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం మాత్రం ఇతర పద్దులో జమ అవుతోంది. గనుల శాఖలో కొందరు అధికారులు క్వారీ యజమానులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం వల్ల సర్కారుకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement