
పాకిస్తానీయులను దేశం నుంచి పంపించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీయులను పంపించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు మంగళవారం వినతిపత్రం అందించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం మాట్లాడుతూ ఇటీవల పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రవాదులు కశ్మీర్‌లో క్రూరమైన దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు బలికొన్నారని తెలిపారు. భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్ దేశస్తులను కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి పంపించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వర్‌రావు, మల్లికార్జున్, వెంకన్న తదితరులు ఉన్నారు.
ప్రజల సమస్యలు పరిష్కరించాలి
ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం మాట్లాడుతూ కెరమెరి, చింతలమానెపల్లి మండలాల్లో సరైన రోడ్లు, తాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వెంకటి, విజయ్, తుకారాం, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.