
‘ఇందిరమ్మ’ జాబితాలో అనర్హులుండొద్దు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకంలో అనర్హులు ఉండవద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఇందిరమ్మ ఇళ్ల జాబితా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబితా పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. ఎలాంటి అవకతవకలున్నా సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 5 వరకు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. నూతన రేషన్ కార్డుల దరఖాస్తులు పరిశీలించి అర్హులకు మంజూరయ్యేలా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
కేంద్ర మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో సోమవారం తలపెట్టిన కేంద్ర మంత్రుల పర్యటనకు పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మీదుగా వెల్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి–363ను ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ, ఇతర మంత్రులతో కలిసి ప్రారంభిస్తారని, కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ సమీపంలో హెలిప్యాడ్, బహిరంగ సభకు సంబంధించి ఏర్పా ట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.