
పేరుకే వనాలు..!
● గ్రామాల్లో ఆహ్లాదం పంచని పల్లె ప్రకృతి వనాలు
● అధిక ఉష్ణోగ్రతలతో ఎండిపోయిన మొక్కలు
● గ్రామ పంచాయతీలపై నిర్వహణ భారం
● పట్టించుకోని ప్రత్యేకాధికారులు!
తిర్యాణి(ఆసిఫాబాద్): ప్రజలకు ఆహ్లాదం పంచాల్సిన ప్రకృతి వనాలు కళావిహీనంగా మారాయి. నిర్వహణ లేక చాలా చోట్ల మొక్కలు ఎండిపోయి పచ్చదనం కరువైంది. జిల్లాలో 334 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అనుబంధ గ్రామాల్లో పచ్చదనం పెంపునకు జిల్లా వ్యాప్తంగా 1056 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ప్రతి వనంలో దాదాపు 30వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. 2021 వరకు పల్లె ప్రకృతి వనాల నిర్వహణ బాధ్యతలు ఉపాధిహామీ సిబ్బంది చేపట్టేవారు. ప్రస్తుతం వాటి బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ప్రస్తుతం పంచాయతీల్లో మొక్కల సంరక్షణను పట్టించుకునే వారు కరువయ్యారు.
ఊరికి దూరం.. నిర్వహణ భారం
జిల్లాలోని 15 మండలాల్లో భిన్న పరిస్థితులు ఉన్నాయి. ఏజెన్సీ మండలాలైన తిర్యాణి, కెరమెరి, సిర్పూర్(యూ), జైనూర్, లింగాపూర్‌లో ఎక్కువగా గుట్టలు కనిపిస్తాయి. ఇక్కడ భూమి రాళ్లతో నిండి ఉంటుంది. ఆయా మండలాల్లో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా గ్రామాలకు దూరంగా గుట్టల వద్ద ప్రకృతి వనాలు నిర్మించారు. జిల్లాలోని పలు మండలాల్లో స్థలం దొరకకపోవడంతో మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఒకేచోట వనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటి నిర్వహణ కూడా సక్రమంగా చేపట్టకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో పంచాయతీ నాలుగైదు పల్లె ప్రకృతి వనాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. చిన్న పంచాయతీలు, ఆదాయం తక్కువగా ఉన్న జీపీలకు ఇది భారంగా మారింది.
పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహణ
పల్లె ప్రకృతి వనాల నిర్వహణను సంబంధిత గ్రామ పంచాయతీల ద్వారా చేపడుతున్నాం. మొక్కలు ఎండిపోయిన చోట కొత్తవి నాటుతాం. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
– భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి

పేరుకే వనాలు..!

పేరుకే వనాలు..!