జిల్లా జనరల్ ఆస్పత్రిని వేధిస్తున్న కొరత
సగానికిపైగా భర్తీ కాని రెగ్యులర్ పోస్టులు
కొన్ని విభాగాల్లో నిలిచిన శస్త్రచికిత్సలు
వైద్యసేవలపైనే కాక బోధనపైనా ప్రభావం
ఈ విభాగాల్లో మరీ ఇక్కట్లు
రెగ్యులర్ వైద్యుల పోస్టుల వివరాలు
ఖమ్మంవైద్యవిభాగం: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమాన సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఆస్పత్రితో పాటు కళాశాల భవనాలు, హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాయి. బోధన, బోధనేతర సిబ్బందిని కూడా నియమించి కళాశాలను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. బోధన, వైద్య సేవలకు అవసరమైన వైద్యులను మాత్రం పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. దీంతో ఆ ప్రభావం చికిత్స కోసం వచ్చే వారితో పాటు విద్యార్థులపై పడుతోంది. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నప్పటి కంటే డీఎంఈ పరిధిలోకి వచ్చాక పరిస్థితులు భిన్నంగా మారడం.. చాలా విభాగాల్లో సరిపడా వైద్యులు లేక ఇబ్బంది ఎదురవుతోంది.
115 మందికి 48 మందే..
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం మూడో ఏడాది విద్యార్థులకు బోధన జరుగుతోంది. అలాగే సెప్టెంబర్‌లో నాలుగో బ్యాచ్ రానుంది. కళాశాలలో 100 సీట్లకు అనుమతి ఉండగా, ఈ ఏడాది 25 పీజీ సీట్లకు అనుమతులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. కానీ, వీరికి బోధించడానికి అవసరమైన వైద్యులను సరిపోను భర్తీ చేయలేదు. కళాశాల, ఆస్పత్రిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు 115కి గాను 48 మంది వైద్యులే విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, సీనియర్ రెసిడెంట్లు 70 పోస్టులకు 42 మందే ఉన్నారు. ఇందులో కొన్ని రెగ్యులర్ పోస్టులు లేకపోవడంతో కాంట్రాక్టు విధానంలో వైద్యులను భర్తీ చేస్తున్నా.. అనుభవ లేమి కారణంగా ఓపీ, ఇన్‌పేషంట్లకు వైద్యసేవలు సక్రమంగా అందకపోగా శస్త్రచికిత్స నిర్వహణపై ప్రభావం పడుతోంది. అంతేకాక విద్యార్థులకు బోధన విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సదరమ్ శిబిరాలపైనా ప్రభావం
ఖాళీల భర్తీ జరగకపోగా.. ఇటీవల సాధారణ బధిలీల్లో కొందరు వైద్యులకు స్థానచలనం కలిగింది. దీంతో కీలకమైన సదరమ్ శిబిరాల నిర్వహణకు ఇబ్బంది ఏర్పడుతోంది. పెద్దాస్పత్రిలో ప్రతీ వారం రెండు శిబిరాలు నిర్వహిస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులకు వైకల్య పరీక్షలు నిర్వహించి అర్హులైతే సర్టిఫికెట్ జారీ చేయాలి. కానీ, ఈ శిబిరాల నిర్వహణలో కీలకమైన ఆర్థోపెడిక్, ఈఎన్ టీ, కంటి, మానసిక వైద్యుల కొరత ఏర్పడింది. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా కంటి విభా గం హెచ్‌ఓడీ రామూనాయక్, మరో ఫ్రొఫెసర్‌కు స్థానచలనం కలిగింది. ఈ స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో రెటీనా శస్త్రచికిత్సలు నిలిచిపో యాయి. అలాగే, సదరమ్ శిబిరాల్లో కంటి వైకల్య పరీక్షలు నిర్వహించటానికి ఇబ్బంది అవుతోంది. ఇంకా, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్, మానసిక వైద్యుల కొరత మూలంగా బోధన, వైద్య సేవలు, సదరమ్ శిబిరాల నిర్వహణకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మరోపక్క రేడియాలజీ పోస్టులు భర్తీ జరగక ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ సేవలపై ప్రభావం పడుతోంది. చాలా విభాగాల్లో ప్రస్తుతం సీనియర్ రెసిడెంట్ల (ఎస్‌ఆర్)తో కాలం నెట్టుకొస్తున్నారు.
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి
జనరల్ ఆస్పత్రిలో ప్రధానంగా ఆర్థోపెడిక్ సేవలు కీలకం. శరీరంలోని ఎముకలు విరిగి, ఇతర సమస్యలతో పలువురు వస్తుంటారు. ఓపీ, ఐపీతో పాటు మేజర్, మైనర్ సర్జరీలు, విద్యార్థుల బోధనకు ఆర్థోపెడిక్ వైద్యుల సేవలు కీలకం. కానీ, ఈ విభాగంలో ఒక ప్రొఫెసర్ ఉండగా, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉంది. అలాగే 10 మంది వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమైతే కేవలం ఇద్దరే విధులు నిర్వర్తిస్తున్నారు.
జనరల్ మెడిసిన్‌లో ఒక అసోసియేట్, రెండు అసిస్టెంట్ పోస్టులు, చర్మ, మానసిక విభాగాల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయి.
జనరల్ సర్జరీ విభాగంలో మూడు అసిస్టెంట్, ఒక అసోసియేట్, ఈఎన్‌టీలో అసిస్టెంట్, అసోసియేట్ పోస్టులు ఒక్కొక్కటి భర్తీ చేయాల్సి ఉంది.
గైనిక్ విభాగంలో ఏడు అసిస్టెంట్, ఒక అసోసియేట్ పోస్టు ఖాళీగా ఉన్నాయి.
ఆప్తమాలజీ ఒక ప్రొఫెసర్, రెండు అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రేడియాలజీలో మూడు, డెంటల్‌లో రెండు, అనాటమీ విభాగంలో రెండు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
హోదా మంజూరు భర్తీ ఖాళీలు
ప్రొఫెసర్ 27 15 12
అసోసియేట్ 30 08 22
అసిస్టెంట్ 58 25 33
సీనియర్ రెసిడెంట్ 70 42 28
మొత్తం 185 90 95


