కబ్జాకు రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

కబ్జాకు రాజమార్గం

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

ఇదీ ప్రక్రియ.. విచారణ చేయిస్తాం..

జెండా పాతేయ్‌..

క్షేత్రస్థాయి పరిశీలనలో

కేఎంసీ అధికారుల నిర్లక్ష్యం

ఇదే అదునుగా చెలరేగిపోతున్న ఆక్రమణదారులు

‘డీమ్డ్‌ అప్రూవల్‌’ లొసుగుతో ఇంకొందరి యత్నాలు

ఇంటి నంబర్‌ కావాలంటే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, భవన నిర్మాణ అనుమతులు, ఈసీ(భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే పత్రం.), ఆధార్‌కార్డు జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఆపై వార్డు ఆఫీసర్‌ లేదా బిల్‌ కలెక్టర్లు ఆర్‌ఐతో కలిసి భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి హద్దులను నిర్ధారించాలి. అంతా సవ్యంగా ఉంటే ఆ తర్వాత దరఖాస్తు రెవెన్యూ ఆఫీసర్‌ లాగిన్‌కు, అక్కడి నుంచి కమిషనర్‌ లాగిన్‌కు వెళ్లాక పరిశీలించి అనుమతిస్తారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్‌ పరిధిలో ఇలా 1,464 అసెస్‌మెంట్‌ నంబర్లు కేటాయించారు.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సామాన్యుడు రూపాయి, రూపాయి పోగేసి కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టి నంబర్‌ తీసుకోవాలంటే సవాలక్ష డాక్యుమెంట్లు జత చేయాలి. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాలి. కానీ కొందరు ఏకంగా ప్రభుత్వ స్థలాలకే ఇంటి నంబర్లు సులువుగా సంపాదిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని ఎన్నెస్పీ భూములకు చాలామంది గతంలో ఇలా నంబర్లు తీసుకోవడం, ఇంకా కొందరు తీసుకుంటుండడం గమనార్హం. ఖమ్మం 14వ డివిజన్‌ గొల్ల గూడెంలోని పాత గ్రామపంచాయతీ భవన సముదాయ స్థలానికి ఇంటి నంబర్‌ కేటాయించిన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. ఇలా జరగడానికి అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇది అక్రమార్కులకు కలిసి వస్తుండడంతో ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

డిమాండ్‌ ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా..

గతంలో ప్రభుత్వాలు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాయి. అయితే కొందరు ఆయా సర్వే నంబర్లలోనే కాక సమీప ప్రాంతంలోకి వెళ్లి కబ్జా చేస్తూ ఆ భూమే తమకు ప్రభుత్వం కేటాయించిందనే వాదనను తెరపైకి తెస్తున్నారు. కొందరు ఆక్రమణదారులు భూ యజమానులతో కలిసి డిమాండ్‌ ఎక్కువగా ఉన్న భూమే లక్ష్యంగా ఇలా వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. ఫలితంగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఖమ్మం ఎల్‌బీనగర్‌లోని పవర్‌ ప్లాంట్‌ సమీపాన ఓ వ్యక్తికి 2004లో ఇంటి స్థలం ఇచ్చారు. సదరు వ్యక్తి అక్కడ కాకుండా గజం రూ.30వేల విలువైన ఎన్నెస్పీ ప్రధాన కాల్వ కట్ట పక్కన ఉన్న స్థలంలో ఇళ్లు కట్టాడు. రఘునాథపాలెం బైపాస్‌ ప్రధానరోడ్డుకు, వైరా, ఖమ్మం ప్రధాన రహదారికి సమీపాన ఈ ఇంటికి కార్పొరేషన్‌ నుంచి ఇంటి నంబర్‌ కూడా వచ్చింది. గతంలో ఇదే స్థలంలో నిర్మాణాన్ని అధికారులు కూల్చివేసినా మళ్లీ నిర్మించి నంబర్‌ సాధించడం గమనార్హం.

ప్రభుత్వ భూములకు నంబర్లు!

ప్రభుత్వ భూములకు కూడా ఇంటి నంబర్లు కేటాయించిన అంశం వెలుగుచూడడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన అధికారుల నిర్లక్ష్యం, ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు పట్టింపులేని తనమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సర్వే నంబర్‌ ఒకచోట.. భూమి మరోచోట చూపిస్తున్నా పట్టించుకోవడం లేదని సమాచారం. కొత్త నిబంధనల ప్రకారం ఇంటినంబర్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. అంతా సవ్యంగా ఉంటే నంబర్‌ కేటాయించడం, ఏవైనా లొసుగులు ఉంటే ఈ గడువులోగా జరిగిపోవాలి. అలా జరగని పక్షంలో డీమ్డ్‌ అప్రూవల్‌ అవుతుంది. అంటే 15రోజుల్లోపు ఏ చర్య తీసుకోకపోతే ఇంటి నంబర్‌ కేటాయింపు జరుగుతుంది. 2021–2023 మధ్య కాలంలో ఇలా చాలా అప్రూవల్స్‌ జరిగాయని తెలుస్తోంది. అప్పట్లో దీనిపై విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టి ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

రఘునాథపాలెం బైపాస్‌ రోడ్డులో ఎన్నెస్పీ ప్రధాన కాల్వ పక్కన నిర్మించిన ఇంటికి నంబర్‌ కేటాయించిన అంశంపై పరిశీలన చేయిస్తాం. అనుమానం ఉన్న మిగతా ఇంటి నంబర్లను కూడా పరిశీలించాలని వార్డు ఆఫీసర్‌ను ఆదేశిస్తాం. గొల్లగూడెంలోని పంచాయతీ కార్యాలయ సముదాయానికి నంబర్‌ ఇచ్చిన అంశంపై ఇప్పటికే విచారణకు ఆదేశించాం.

– అభిషేక్‌ అగస్త్య, కమిషనర్‌, కేఎంసీ

కార్పొరేషన్‌ పరిధిలోని ఎన్నెస్పీ భూముల్లో ఆక్రమణలకు అంతులేకుండా పోయింది. ఖాళీ భూమి కనిపిస్తే చాలు తప్పుడు పత్రాలు డాక్యుమెంట్లు సృష్టించడం.. ఆ స్థలాన్ని కబ్జా చేయడం రోజుల వ్యవధిలో పూర్తవుతోంది. ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో కబ్జాదారులు దూసుకెళ్తున్నారు. ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతోపాటు ఇంటి నంబర్లు తీసుకోవడం, ఆపై స్థలాన్ని అమ్మడమా, లేదా నిర్మాణం చేపట్టడమో చకచకా జరిగిపోతోంది.

ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు

Advertisement
 
Advertisement
Advertisement