క్షేత్రస్థాయిలో ప్రతీ దరఖాస్తు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయిలో ప్రతీ దరఖాస్తు పరిశీలన

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

సజావుగా ధాన్యం కొనుగోళ్లు

ప్రజాదర్బార్‌ అర్జీలపై కలెక్టర్‌ దివాకర

నేలకొండపల్లి: పాలేరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌ల్లో అందుతున్న దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. నేలకొండపల్లి తహసీల్‌లో అధికారులతో ఆయన దరఖాస్తుల పరిశీలనపై సమీక్షించారు. దరఖాస్తులను ఏ ప్రాతిపదికన విభజించారు, పరిశీలనకు నిర్దేశించుకున్న లక్ష్యాలపై ఆరా తీశాక కలెక్టర్‌ మాట్లాడారు. నేలకొండపల్లి మండలంలోని మూడు క్లస్టర్లలో ప్రజాదర్బార్ల ద్వారా 636 దరఖాస్తులు అందిన నేపథ్యాన ఏ ఒక్కటి తిరస్కరించకుండా పరిష్కరించాలని ఆదేశించారు.

కాకరవాయిలో సమగ్ర భూసర్వే పరిశీలన

తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయిలో పైలట్‌ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వేను కలెక్టర్‌ దివాకర పరిశీలించారు. భూమి హద్దులు, రికార్డుల నమోదు, మ్యాపింగ్‌పై ఆరా తీశాక ఆయన మాట్లాడుతూ భూసర్వే పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించాలని సర్వేయర్లకు సూచించారు. ఈ సర్వే పూర్తయితే భూవివాదాలు తగ్గడంతో పాటు రైతులకు భూమి హక్కులపై రక్షణ ఉంటుందని చెప్పారు. గ్రామస్తులు కూడా సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే, ప్రజా దర్బార్‌ వినతుల పరిష్కారంపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సుద్దవాగుతండాలో సమస్యలపై సర్పంచ్‌ బానోతు రవి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆర్‌డీఓ శ్రీనివాస్‌, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రాజేందర్‌, తహసీల్దార్లు పి.రాంప్రసాద్‌, లూథర్‌ విల్సన్‌, ఎంపీడీఓ షేక్‌ సిలార్‌ సాహెబ్‌, ఉద్యోగులు కనకం నరసింహారావు, ఆలస్యం మధుసూదన్‌రావు, అల్లం రవికుమార్‌, సుధీర్‌, పవన్‌, లక్ష్మణ్‌ ఎంపీఓ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ గూడూరు ఉపేందర్‌ పాల్గొన్నారు.

గ్రీన్‌ ఎనర్జీ వినియోగాన్ని విస్తృతపర్చాలి

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో గ్రీన్‌ ఎనర్జీ విని యోగం విస్తృతంగా పెరిగేలా సోలార్‌ పవర్‌పై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. ఎన్‌పీడీసీఎల్‌, టీజీ రెడ్‌కో అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశమైన ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి రావాలని, అవసరమైన ప్రాంతాల్లో సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటుచేయాలని తెలిపారు. అలాగే, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇక మధిరలో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ లైన్ల ఏర్పాటు పనులు చేపట్టే క్రమాన కేబుల్‌, ఇంటర్నెట్‌ సంస్థలే కాక మున్సిపల్‌ ఉద్యోగులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఆతర్వాత సబ్‌ స్టేషన్ల నిర్మాణ పనులు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సోలార్‌ ప్రాజెక్టుల నిర్మాణం, మోడల్‌ సోలార్‌ విలేజ్‌ పథకం కింద ఎంపికైన గ్రామాల్లో పనులపై కలెక్టర్‌ సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ శ్రీనివాసచారి, డీఈలు బాబూరావు, రామారావు, నాగేశ్వరరావు, రమేష్‌, భద్రుపవార్‌, శ్రీనివాసరావు, రెడ్కో జీఎం అజయ్‌ పాల్గొన్నారు.

ఖమ్మంసహకారనగర్‌: ధాన్యం దిగుమతిలో జాప్యం జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణతో సజావుగా కొనసాగుతున్నాయని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. స్పష్టం చేశారు. ‘సాక్షి’ లో ఈనెల 17న కల్లూరు, ముదిగొండ మండలాల్లో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ‘దళారులే దిక్కు’, ‘దోచేస్తున్నారు’ శీర్షికలతో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. కల్లూరు మార్కెట్‌ యార్డు(ఖాన్‌ఖాన్‌పేట) కేంద్రానికి ఇప్పటివరకు 1,400 టన్నుల ధాన్యం రాగా 1,336 టన్నులు కొనుగోలు చేసి మిల్లులకు తరలించామని తెలిపారు. మిగతా ధాన్యాన్ని తరలించేలా లారీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 309 కేంద్రాలకు ఇప్పటివరకు 1,10,961 టన్నుల ధాన్యం రాగా, అందులో 1,00,931 టన్నుల కొనుగోలు చేశామని వెల్లడించారు. అంతేకాక 97,719 టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించి, మిగిలిన 3,211 టన్నుల ధాన్యం తరలింపునకు వాహనాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement