ఖమ్మం మార్కెట్‌కు వేసవి సెలవులు | - | Sakshi
Sakshi News home page

ఖమ్మం మార్కెట్‌కు వేసవి సెలవులు

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

10 నుంచి జూన్‌ 7 వరకు

క్రయవిక్రయాలకు బ్రేక్‌

ఖమ్మంవ్యవసాయం: ఎండ తీవ్రత నేపథ్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వేసవి సెలవులు ప్రకటించారు. వేసవి ఉష్ణోగ్రతల కారణంగా పంటల క్రయవిక్రయాల్లో కార్మికులు, గుమస్తాలు, వ్యాపారులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండడంతో సెలవులు ప్రకటించాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ బాధ్యులు మార్కెట్‌ కమిటీని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా సెలవులకు అనుమతించారు. దీంతో ఈనెల 10 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్‌ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌ తెలిపా రు. వారాంతపు సెలవైన శనివారం(9వ తేదీ న) మార్కెట్‌లో పంటల కొనుగోళ్లు నిర్వహించనుండగా, ఆతర్వాత సెలవులు మొదలవుతాయని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.

19వరకు ఓపెన్‌

యూనివర్సిటీ ఫీజు గడువు

ఖమ్మం సహకారనగర్‌: డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం రెండు, ద్వితీయ సంవత్సరం నాలుగు, తృతీయ సంవత్సరం ఆరో సెమిస్టర్‌ విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు ఈనెల 19వ తేదీ వరకు అవకాశముంది. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహ్మద్‌ జాకీరుల్లా, అధ్యయన కేంద్ర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.వీరన్న తెలిపారు. పరీక్షలు జూన్‌ 14వ తేదీ నుంచి నిర్వహించనున్న నేపథ్యాన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నేరుగా లేదా మీ సేవా కేంద్రాల్లో పరీక్ష ఫీజు, ప్రాక్టికల్స్‌ ఫీజు చెల్లించాలని సూచించారు. వివరాలకు Dr.BRAOU.Online.in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని తెలిపారు.

హైవేపై నిలిచిన వాహనాలు

టోల్‌ బూత్‌ వద్ద సాంకేతిక సమస్య

వైరా: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలోని వైరా మండలం సోమవరం టోల్‌బూత్‌ వద్ద గురువారం సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యాన వాహనాల టోల్‌ఫీజు వసూళ్లు నిలిచి పోయాయి. సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వాహనాలను ఓ వైపు నుంచే అనుమతించారు. ఫలితంగా గంటల తరబడి వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగగా వేచిఉండాల్సి వచ్చింది. చివరకు సమస్య పరిష్కారం కావడంతో రాకపోకలను క్రమబద్ధీకరించారు.

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు

ఖమ్మం సహకారనగర్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 13వ తేదీ నుంచి జరగనుండగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నిర్ణీత తేదీల్లో పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5–30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 37కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 10,344 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,562 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఎండల నేపథ్యాన కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్‌, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. అంతేకాక కేంద్రాల సమీపంలో జిరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లు మూసివేయించి భద్రత కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఐఈఓ కె. రవిబాబు, డీఈసీ సభ్యులు ఎం.సింహాచలం, డీఎంహెచ్‌ఓ రామారావు తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి

సువర్ణ పుష్పార్చన

పాల్వంచరూరల్‌: పాల్వంచ మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్‌ శర్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement