వాహనదారుల్లా వెళ్లి తనిఖీలు
ఆర్‌టీఓ కలెక్టరేట్‌లో ఉండగా...
● ఆర్‌టీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ● రూ.70వేల నగదుతో పాటు కార్డుల స్వాధీనం ● అధికారుల విచారణ, అదుపులో ఏజెంట్లు
ఉదయం 11గంటలకే..
జిల్లా రవాణా శాఖ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తనిఖీకి సిద్ధమైన ఏసీబీ ఉద్యోగులు ఉదయం 11గంటలకే రవాణా శాఖ కార్యాలయానికి ఆటోలో వచ్చి లైసెన్స్‌ల కోసమని కార్యాలయంలో ఆరాతీశారు. అయితే, సరైన సమాధానం రాకపోవడంతో సమీపంలోని ఏజెంట్ల కార్యాలయాల్లో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. ఎంత చెల్లించాలి, ఎవరిని కలవాలో ఏజెంట్లు చెప్పాక తనిఖీలకు సిద్ధమయ్యారు. ఒక్కసారి ఆర్‌టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలకు దిగడంతో కీలక పోస్ట్‌లోని అఽధికారి వద్ద పనిచేసే అసిస్టెంట్‌తోపాటు ఏజెంట్లు పారిపోతుండగా వెంటపడి మరీ పట్టుకున్నారు. ఇరవై మందికి పైగా ఏజెంట్లను అదుపులోకి తీసుకుని లెక్కల్లో లేని రూ.70వేలకు పైగా నగదు, ఆర్‌సీలు, లైసెన్స్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కీలక అధికారి అసిస్టెంట్‌గా భావిస్తున్న వ్యక్తి వద్ద కోడ్ వేసి పత్రాలు లభ్యమయ్యాయి.
వాటా పెంచాల్సిందే...
ఏజెంట్లు, ఖమ్మంలోని రవాణా శాఖా కార్యాలయ ఉద్యోగుల నడుమ కొన్నాళ్ల నుంచి వివాదాలు తలెత్తినట్లు తెలిసింది. లైసెన్స్‌ల జారీకి ప్రసుత్తం ఇస్తున్న వాటా పెంచాలంటూ కొందరు ఉద్యోగులు వారి ద్వారా వచ్చే దరఖాస్తులను పక్కన పెట్టినట్లు సమాచారం. దీంతో పలువురు ఏజెంట్లే నేరుగా హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఏసీబీ డిఎస్పీ రమేష్ ఆధ్వర్యాన తనిఖీలు చేపడుతున్నసమయాన ఇన్‌చార్జ్ ఆర్‌టీఓ వెంకటరమణ కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. దీంతో అక్కడకు వెళ్లి ఆయనను బయటకు పిలిచి వెంకటరమణతో పాటు డ్రైవర్ సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తీసుకొచ్చారు. అలాగే, పలువురు ఏఎంవీఐలు, సిబ్బంది ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. కాగా, ఆర్‌టీఓ వెంకరమణ, ఏఎంవీఐ స్వర్ణలత ఇళ్లలో నూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. అలాగే, రాత్రి వరకు కార్యాలయ ఉద్యోగులు బయటకు వెళ్లకుండా తనిఖీలు చేపట్టారు. ఏజెంట్ల వద్ద దొరికిన నగదు, వాహనదారులకు సంబంధించిన కార్డులను సీజ్ చేశామని.. వీటితో సంబంధం ఉన్న వారందరిపై కేసులు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు.
సాధారణ వాహనదారుల్లా ఏజెంట్లను కలిసిన ఏసీబీ అధికారులు వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్‌కు ఎంత తీసుకుంటున్నారో ఆరాతీశారు.. అసలు ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు తేలడం, ఏజెంట్ల ద్వారా వెళ్తేనే పని అవుతుందని బయటపడడంతో ఒకేసారి బృందంగా ఏర్పడిన ఏసీబీ అధికారులు శనివారం జిల్లా రవాణా శాఖా కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఈ విషయాన్ని గుర్తించి అటు ఏజెంట్లు, ఇటు ఉద్యోగులు తేరుకునేలోగా పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు లెక్కల్లో లేని రూ.70వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక రవాణా శాఖ ఉద్యోగుల ఇళ్లలోనూ చేపట్టిన తనిఖీలు శనివారం రాత్రి వరకు కొనసాగాయి.
– ఖమ్మంక్రైం


