ప్రపంచంతో పోటీ పడేలా ఎదగాలి
ఆకట్టుకున్న సైన్స్‌ఫేర్ 8లో..
● విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే కీలకం ● జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల
ఖమ్మం సహకారనగర్: ప్రపంచంలో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం బల్లేపల్లిలోని ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్, ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌ను శనివారం ఆయన కలెక్టర్ అనుదీప్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 900 ఎగ్జిబిట్లు ఎగ్జిబిషన్‌కు రావడం విద్యార్థుల్లో సృజనాత్మకతకు నిదర్శనమని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి కొందరు విద్యార్థులు పరికరాలు రూపొందించారని కొనియాడారు. ఇబ్బందులు వెంటాడినా అత్యున్నత స్థాయికి చేరిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా విద్యా ప్రమాణాలు పెంచేలా బోధించాలని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన పెంచేలా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాలను చదువుతూనే పరిసరాలను పరిశీలిస్తే సమస్యలపై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళిశ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి ప్రదర్శనలు రాష్ట్రస్థాయిని తలపించేలా ఉన్నాయని అభినందించారు. డీఈఓ చైతన్య జైనీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగర్ల హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మల్లీదు వెంకటేశ్వర్లు, కమర్తపు మురళితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


