శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయంలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి వేలాదిగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
ఖమ్మంలీగల్: రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనల మేరకు జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్‌లో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎస్.రాజగోపాల్ తెలిపారు. సత్వర కేసుల పరిష్కారమే లక్ష్యంగా లోక్‌అదాలత్ నిర్వహణ ఉంటుందని వెల్లడించారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన అన్ని కేసులు పరిష్కరించనున్నందున కక్షిదారులు సద్విని యోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి
ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన మైనార్టీ విద్యార్థులు(ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, పార్శిలు) సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్ సూచించారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, సింగపూర్, న్యూజిలాండ్, సౌత్ కొరియాలోని ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారే అర్హులని పేర్కొన్నారు. పీజీ కోసం ఇంజనీరింగ్ డిగ్రీలో 60 శాతం, డాక్టరేట్ చేసేందుకు పీజీలో 60 శాతం మార్కులు వచ్చి ప్రవేశాలు పొందిన వారు ఈనెల 31వ తేదీలోగా www.telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం దరఖాస్తు కాపీలకు ధ్రువపత్రాలు జత చేసి వచ్చేనెల 31లోగా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.


