‘యాప్’తో యూరియా కొనుగోలు సులభతరం
ఖమ్మంవ్యవసాయం: క్యూ కట్టకుండా, వేచి ఉండకుండా యాప్ ద్వారా యూరియా కొనుగోలు సులభం కానుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొబైల్ యాప్ పనితీరుపై రైతులు, ఎరువుల డీలర్లకు శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. యూరియా లభ్యతపై రైతులు అనుమానాలు పెట్టుకోవద్దని తెలిపారు. సరిపడా యూరియా ఉండగా.. పారదర్శకత, అర్హులకే యూరియా అందాలనే భావనతో యాప్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈమేరకు పూర్తి వివరాలతో లాగిన్ అయి బుక్ చేసుకోవాలని, అనుమానాలు ఉంటే ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. కాగా, ఎకరంలోపు విస్తీర్ణం ఉన్న రైతులకు ఒక దఫాలో, 1 – 5 ఎకరాల్లోపు విస్తీర్ణం ఉన్న రైతులకు రెండు సార్లు, 5 – 20 ఎకరాల్లోపు ఉంటే మూడు దఫాల్లో, 20 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు నాలుగు దఫాల్లో అవసరమైన యూరియా సరఫరా జరుగుతుందని తెలిపారు. కాగా, డీలర్లు ఈ విధానంపై అవగాహన పెంచుకోవాలని, ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి ఎం.వీ.మధుసూదన్, డీసీఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


