ఉపసర్పంచ్ పదవికీ డిమాండే..
మీకు సర్పంచ్...
మాకు ఉపసర్పంచ్
● రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో తగ్గుతున్న పలువురు ● సర్పంచ్ అభ్యర్థి ఖర్చులు భరించేందుకు ఆసక్తి ● నిధుల వినియోగంలో జాయింట్ చెక్‌పవరే కారణం?
వైరా: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ పదవికి పోటీ చేయాలని పలువురు నాయకులు ఆశించారు. ఇందుకోసం ఒకటి, రెండేళ్లుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, పలువురికి రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఇలాంటి గ్రామాల్లో ఉపసర్పంచ్ పదవైనా దక్కించుకోవాలని వార్డు మెంబర్లుగా పోటీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ, మహిళా రిజర్వేషన్లు ఉన్న గ్రామాల్లో ఉపసర్పంచ్‌గా ఎన్నికై తే తామే పెత్తనం సాగించొచ్చనే భావనతో వార్డు సభ్యుల మద్దతు కూడగడ్డుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని చాలా గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు ఆశావహులకు అనుకూలంగా రాకపోవడం, మహిళలకు 50శాతం రిజర్వ్ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది.
గ్రామ పాలనలో కీలకమే..
గ్రామపాలనలో ఉపసర్పంచ్ కూడా కీలక భూమిక పోషించనున్నారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నిధుల వినియోగంపై సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు కూడా ఉమ్మడి చెక్ పవర్ కట్టబెట్టారు. దీంతో ఉపసర్పంచ్ పదవి కీలకంగా మారింది. దీంతో ఈ పదవి ద క్కించుకునేందుకు చిన్న పంచాయతీల్లో నూ పలువురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఎస్టీ,ఎస్సీ,మహిళలకు సర్పంచ్ పదవి రిజర్వ్ అయిన చోట వార్డుమెంబర్లుగా జనరల్ అభ్యర్థులు గెలిచి ఉపసర్పంచ్ పదవి చేజిక్కించుకోవాలనే యత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందుకోసం సహచర వార్డు అభ్యర్థుల మద్దతు కూడగడుతూనే సర్పంచ్ అభ్యర్థికి కావాల్సిన ఆర్థిక చేయూత కూడా ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం.
చెక్‌పవర్‌తో పెత్తనం..
ఉపసర్పంచ్‌లకు సర్పంచ్‌తో పాటు జాయింట్ చెక్ పవర్ ఉండడంతో ఈ పదవికి డిమాండ్ పెరిగింది. గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్‌పవర్ కల్పించిన ప్రభుత్వం బాధ్యతలను పూర్తి స్థాయిలో సర్పంచ్‌లకే అప్పగించింది. ప్రభుత్వ పథకాల అమలులో విఫలమైతే సర్పంచ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా ఉపసర్పంచ్‌కు ఆ ముప్పు లేదు. ఒకవేళ ఎక్కడైనా సర్పంచ్‌పై అనర్హత వేటు పడితే ఉపసర్పంచ్‌ను సర్పంచ్‌గా ఎన్నుకునే అవకాశముంది. దీంతో ఉపసర్పంచ్ పదవిపై కన్నేసిన పలువురు.. మహిళా సర్పంచ్‌లు ఉన్న స్థానాలపై పెత్తనం తామే చేయొచ్చనే భావనకు వచ్చినట్లు తెలిసింది. ఫలితంగా చాలా జీపీల్లో నువ్వు సర్పంచ్.. నేను ఉపసర్పంచ్ అన్నట్లు ఒప్పందంచేసుకుని ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చకుదారి తీస్తున్నాయి. తొలి విడతగా ఏడు మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలు 1,740 వార్డు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇందులో 17 పంచాయతీ సర్పంచ్ పదవు లు ఏకగ్రీవం కాగా.. కొన్నిచోట్ల అన్ని వార్డులు, ఇంకొన్ని చోట్ల కొన్నేసి కలిసి 323 వార్డుస్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక రెండు, మూడో దశల్లో సైతం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు చర్చలు జరుపుతూ అధికార పార్టీకి సర్పంచ్ స్థానం, ప్రతిపక్ష పార్టీలకు ఉపసర్పంచ్ స్థానం తీసుకునేలా ఒప్పందానికి వస్తున్నట్లు సమాచారం. ఈ తరహాలోనే ఇప్పటికే పలు మండలాల్లో ఎంపిక ప్రక్రియ జరిగిందని చెబుతున్నారు.
ఉపసర్పంచ్ పదవికీ డిమాండే..


