పదవులు.. కాసుల కష్టాలు
ఖర్చుకు సరిపడా
డబ్బు అందక ఇక్కట్లు
మాజీ సర్పంచ్‌లను
చూస్తే మరింత ఆవేదన
బిల్లులు రాక ఇబ్బందులు
అప్పులు తెచ్చి పనులు చేశా..
వైరా: గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలి, ఎలాగైనా గెలవాలనే ఆశతో పలువురు హడావుడిగా నామినేషన్లు దాఖలు చేశారు. కానీ నామినేషన్ ర్యాలీ మొదలు ప్రచారంలో రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులను చూసి వారు బెంబేలెత్తిపోతున్నారు. కొద్దోగొప్పో డబ్బు ఉంటే చాలు.. తమకు ఉన్న పేరుతో సులువుగా గట్టెక్కవచ్చని భావించిన ఆ పరిస్థితి లేకపోవడంతో డబ్బులు ఎలా సమకూర్చుకోవాలా అన్న ప్రశ్న వారిని వేధిస్తోంది. మరోపక్క మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులు రాక ఇంకా అవస్థలు పడుతున్న తీరు వీరిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాక బాకీలు చెల్లించలేని స్థితిలో ఉన్న మాజీ సర్పంచ్‌లను చూసి ఇప్పుడు అభ్యర్థులకు అప్పు కూడా పుట్టకపోవడం, రియల్ భూమ్ కూడా లేకపోవడం ఏం చేయాలో పాలుపోవడం లేదని పలువురు వాపోతున్నారు. అయినా బరిలోకి దిగినందున తప్పని పరిస్థితుల్లో ఇళ్లు, భూములు తాకట్టు పెట్టడం, లేదా ఆభరణాలు అమ్ముతూ డబ్బు సమకూర్చుకుంటున్నారు.
ఖర్చు తడిసి మోపెడు..
సాధారణంగా ఎన్నికలంటే ఖర్చుతో ముడిపడి ఉంది. పార్లమెంట్ మొదలు పంచాయతీ ఎన్నికల వరకు ప్రచారంలో ప్రత్యర్థులకు ధీటుగా వ్యవహరించాలంటూ చేతి నిండా డబ్బు ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక వెనక తిరిగి కేడర్‌ను మెప్పించాలన్నా డబ్బే కీలకం. లేదంటే తమ అనుకున్న వారు కూడా ప్రచారానికి రాని పరిస్థితి నెలకొంది. ఒకవేళ వచ్చినా ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం, రాత్రి భోజనమే కాక ‘ఇతరత్రా’సమకూర్చాల్సి వస్తోంది.
రూ.లక్షల్లోనే...
వేయి ఓట్ల లోపు ఉన్న గ్రామపంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి ఖర్చు రూ.8 లక్షలు దాటే అవకాశముందని చెబుతున్నారు. రెండు వేల లోపు ఓటర్లు ఉంటే రూ. 20లక్షలు, అంతకు మించి ఓటర్లు ఉంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సర్పంచ్ అభ్యర్థి ఖర్చు చేయాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ నుంచి పోటీకి దిగిన వారిని తప్పించేందుకు ఎంతో కొంత సమర్పించక తప్పడం లేదని చెబుతున్నారు. ఇక ఏకగ్రీవమైన పంచాయతీలో పోటీ లేకుండా, ప్రచారం చేయకుండా ఖర్చుల బాధ తప్పుతుందని అందరూ అనుకుంటున్నా అక్కడా ఖర్చులు సరిపడా ఉంటున్నాయని తెలుస్తోంది. అందరితో నామినేషన్లు ఉపసంహరించేందుకు ఎంతో కొంత చెల్లించక తప్పడం లేదని.. ఆపై గ్రామ పెద్దలను సంతృప్తి పర్చడం, గ్రామంలో ఏదో అభివృద్ధి పనికి కావాల్సిన నగదు సమకూరుస్తామన్న హామీ ఇవ్వాల్సి ఉన్నందున ఖర్చు అందరితో సమానంగా అవుతోందని చెబుతున్నారు. మాజీ సర్పంచ్‌ల కష్టాలను దృష్టిలో ఉంచుకుని వృథా ఖర్చులు లేకుండా పోటీ చేయాలని అభ్యర్థులకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సూచిస్తున్నారు.
సర్పంచ్ పదవిపై మోజుతో బరిలోకి పలువురు..
గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌గా గెలిచా. అప్పుడు గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.20 లక్షలకు పైగా బిల్లులు రావాల్సి ఉంది. పెండింగ్ బిల్లులు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.
– సాదం రామారావు, రెబ్బవరం, మాజీ సర్పంచ్
ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో సుమారు రూ. 10 లక్షల వరకు అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేయించాను. కానీ రెండేళ్లు గడిచినా మంజూరు కాలేదు. దీంతో అప్పులకు తోడు వడ్డీ పెరుగుతోంది.
– భట్టా పెద్ద భద్రయ్య, తాటిపూడి మాజీ సర్పంచ్
పదవులు.. కాసుల కష్టాలు
పదవులు.. కాసుల కష్టాలు


