మా కష్టం పగోళ్లకూ రావొద్దు
ముదిగొండ: ఇలాంటి కష్టం పగోళ్లకూ రావొద్దని ఇటీవల కర్నూలులో బస్సు కాలిపోయిన ఘటనలో మృతి చెందిన యువకుడు చిట్టోజు మేఘనాథ్ తండ్రి శ్రీనివాసాచారి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈనెల 24న జరిగిన ప్రమాదంలో మేఘనాథ్ సజీవ దహనం కాగా, డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఆయన తల్లిదండ్రులు శ్రీనివా సాచారి – విజయలక్ష్మికి సోమవారం అప్పగించా రు. దీంతో స్వగ్రామమైన ముదిగొండ మండలం వల్లభికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించగా తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యా రు. చేతికందిన కొడుకు కుటుంబానికి నిలుస్తాడని భావిస్తే కానరాని లోకాలకు వెళ్లాడంటూ రోదించారు. ఇలాంటి కష్టం మరెవరికీ రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బస్సు ప్రమాద మృతుడి తండ్రి ఆవేదన


