లక్కీ భాస్కర్‌లు!
షాపు ఇస్తే రూ.కోటికి పైగానే...
● వైన్స్ టెండర్లలో ఈసారి కొత్త ముఖాలకే అదృష్టం ● గిరాకీ ఉండే షాపుల కోసం సిండికేట్ల బేరసారాలు ● కలెక్టర్ నేతృత్వాన 116 వైన్స్‌కు లక్కీ డ్రా
ఖమ్మంక్రైం: సిండికేట్‌గా ఏర్పడిన 15మంది కలిసి 15 వైన్స్ టెండర్లు దాఖలు చేస్తే ఒక్క షాపూ దక్కకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. ఇంకో 17మంది 17 షాపులకు దరఖాస్తు చేస్తే మూడే షాపులు రావడంతో వచ్చిందే చాలు అన్నట్లు సంతోషించారు. ఇదేక్రమంలో ఓ వ్యక్తి రెండు దుకాణాలకు టెండర్లు వేస్తే డ్రాలో ఒకటి తగలడంతో ఆనందపడ్డాడు. ఇవీ ఖమ్మంలో సోమవారం జరిగిన వైన్స్ టెండర్ల ప్రక్రియలో చోటు చేసుకున్న సన్నివేశాలు! నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ కేటాయింపునకు దాఖలైన టెండర్ల నుంచి డ్రా తీశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డ్రా ప్రారంభించడంతో పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు పర్యవేక్షించారు. ఈసారి పలువురు వ్యాపారులు తమ కుటుంబీకుల పేరిట కూడా టెండర్లు వేయడంతో హాల్‌లో మహిళలు, యువతులు ఎక్కువగా కనిపించారు.
సిండికేట్లకు నిరాశ
ఈసారి గతంలో మాదిరి సిండికేట్ల ఆశలు ఫలించలేదు. పాతమద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి వివిధ ప్రాంతాల షాపుల కోసం టెండర్లు వేశారు. కానీ అందులో చాలామందికి నిరాశే ఎదురుకాగా.. కొత్తగా మద్యం వ్యాపారంలోకి వస్తున్న వారికి మాత్రం షాపులు దక్కాయి. ఓ ప్రాంతానికి చెందిన సిండికేట్ వ్యాపారులు 15కు పైగా షాపులకు టెండర్ వేస్తే ఒక్కటీ రాకపోవడంతో బెంబేలెత్తిపోయారు. మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న ఇంకో వ్యాపారి 18 షాపులకు దరఖాస్తు చేసినా నిరాశే ఎదురైంది. కొత్తగా వ్యాపారంలో అడుగు పెట్టిన ఓ వ్యక్తి రెండు దుకాణాలకు తన భార్య పేరిట దరఖాస్తు చేస్తే ఒక షాపు దక్కింది. అలాగే, ఇంకో వ్యక్తి తన కుమార్తె పేరుతో రెండు వైన్స్‌కు దరఖాస్తు వేయగా డ్రాలో ఒకటి డ్రాలో రావడం విశేషం.
వైన్స్ డ్రా జరుగుతుండగానే సిండికేట్ల బాధ్యులు బేరసారాలు మొదలుపెట్టారు. అనుకున్న స్థాయిలో తమకు షాపులు రాకపోవడం, డ్రాలో గెలుపొందిన వారితో చర్చించారు. వ్యాపారం ఆధారంగా ఒక్కో షాప్‌నకు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ఇవ్వడానికై నా సిద్ధమయ్యారు. మరికొందరు తమకు షాపులు అప్పగించడంలో సహకరిస్తే కమీషన్ ఇస్తామంటూ చోటామోటా నాయకులతో పైరవీలు చేయిస్తున్నారు. కాగా, వైన్స్ దక్కించుకున్న వారు మొదటి విడత లైసెన్స్ ఫీజు రూ.10.50 లక్షలు చెల్లించేందుకు మంగళవారం వరకు అవకాశం కల్పించారు. దీంతో షాప్‌ల కోసం బేరసారా లు సాగిస్తున్న సిండికేట్ల బాధ్యులు ఆ ఫీజు తామే చెల్లిస్తామని చెప్పడం కనిపించింది. కాగా, డ్రా ప్రక్రియలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, జిల్లా అధికారి నాగేందర్‌రెడ్డి, ఏఈఎస్ వేణుగోపాల్‌రెడ్డి, సీఐ కృష్ణ తదితరులు పాల్గొనగా ఖమ్మం వన్‌టౌన్ సీఐ కరుణాకర్, ఎస్‌ఐ మౌలానా, ఆర్‌ఐ సాంబశివరావు ఆధ్వర్యాన బందోబస్తు నిర్వహించారు.
లక్కీ భాస్కర్‌లు!


