
యూరియా పంపిణీలో విఫలం
ఖమ్మంమయూరిసెంటర్: రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని, దీని వల్ల తెలంగాణలో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆవుల అశోక్ అన్నారు. ఆదివారం ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సీజన్‌లో రైతాంగానికి యూరియా ఎంత అవసరమో ప్రభుత్వాలకు తెలియంది కాదని, అయినా సరైన సమయానికి యూరియాను అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రైతాంగం నాట్లు వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు యూరియా కోసం ఏం చర్యలు చేపట్టారని ప్రశ్నించారు. యూరియా కోసం వేలాది మంది రైతులు ఆయా కేంద్రాల వద్ద ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నారని, టోకెన్లు పోలీస్ స్టేషన్‌లో పంచె దుస్థితి వచ్చిందంటే సమస్య ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గతేడాది వచ్చిన వరదలతో నష్టపోయిన బాధితులు ఇంతవరకు ప్రభుత్వ సాయం అంతలేదని, పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి శిరోమణి, మాస్‌లైన్ ఖమ్మం నగర కార్యదర్శి శోభ, తేజ నాయక్, ఆజాద్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.