
‘ఇందిరమ్మ’లో ముందంజ
నియోజక వర్గాల వారీగా ఇళ్ల నిర్మాణాల పరిస్థితి ఇలా..
వేగంగా సాగుతున్న గృహ నిర్మాణాలు
ఇప్పటికే 81 శాతం మేర
మార్కింగ్ పూర్తి
పనుల పూర్తిపై వివిధ దశల్లో పర్యవేక్షణ
ఖమ్మంగాంధీచౌక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు దశల వారీగా ముందుకు సాగుతున్నాయి. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిన విషయం విదితమే. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయగా.. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్లరేషన్ కార్డు గల వారికి తొలి దశలో కేటాయించారు. ఒంటరి మహిళలు, వితంతువులకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో నియోజక వర్గాల వారీగా మొత్తం 16,441 ఇళ్లు మంజూరు కాగా అందులో 13, 242 (81 శాతం) ఇళ్లకు మార్కింగ్ చేయగా, వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతున్నాయి.
రాష్ట్రంలోనే జిల్లా టాప్..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు, ఇల్లెందు నియోజక వర్గ పరిధిలోని కామేపల్లి మండలం కలుపుకొని మొత్తం 16,441 ఇళ్లు మంజూరు చేశారు. నిర్మాణ పనుల వేగవంతానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోంది. మంజూరైన ఇళ్లలో 13,24 ఇళ్లకు ముగ్గులు పోయగా 7,700 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్ నిర్మాణాలు పూర్తయ్యాయి. 1,922ఇళ్లు గోడల దశకు వచ్చాయి. 881 ఇళ్లు స్లాబ్ లెవల్‌కు చేరాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం రూరల్ మండలంలో నాలుగు ఇళ్లు పూర్తి కాగా, 290 స్లాబ్ లెవల్‌లో, 638 గోడల లెవల్‌లో, 1,776 బేస్‌మెంట్ లెవల్‌లో ఉన్నాయి. మరో 3,087ఇళ్లు మార్కింగ్ చేసి ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో ఒకటి, వైరా నియోజకవర్గం పరిధిలోని ఏన్కూరు మండలంలో మూడు, కొణిజర్లలో ఒకటి, వైరాలో ఒకటి.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.
జిల్లాలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనుల వేగవంతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముగ్గు పోసిన వాటిని బేస్‌మెంట్ స్థాయికి తీసుకొచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కృషి జరుగుతోంది. బేస్‌మెంట్ స్థాయి దాటితే నిర్మాణ పనుల్లో వేగం పెరుగుతుంది. అనతి కాలంలోనే అన్ని ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం.
– బి. శ్రీనివాస్, హౌసింగ్ పీడీ
నియోజకవర్గం మంజూరైన ముగ్గు బేస్‌మెట్ గోడల స్లాబ్ పూర్తయిన
ఇళ్లు దశ లెవల్ లెవల్ లెవల్ ఇళ్లు
ఖమ్మం 3,285 1,557 724 40 10 01
పాలేరు 3,483 3,087 1,776 638 290 04
మధిర 2,792 2,503 1,637 69 89 ––
సత్తుపల్లి 3,426 3,138 1,756 817 337 ––
వైరా 2,923 2,529 1,585 302 128 05
కామేపల్లి 532 428 222 56 27 ––
మొత్తం 16,441 13,242 7,700 1,922 881 10

‘ఇందిరమ్మ’లో ముందంజ