అంతటా అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

అంతటా అప్రమత్తం

Jul 24 2025 7:40 AM | Updated on Jul 24 2025 7:40 AM

అంతటా

అంతటా అప్రమత్తం

జిల్లాలో రెండు రోజులుగా వర్షం
● అలుగు పోస్తున్న వైరా రిజర్వాయర్‌, కట్టలేరు ● భారీ వర్షసూచనతో అలర్ట్‌ అయిన జిల్లా యంత్రాంగం ● కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాలు, ఆపై వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్‌లో 1077 టోల్‌ఫ్రీ నంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశారు. మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పాలేరు, వైరా రిజర్వాయర్లలోకి ఇన్‌ఫ్లో పెరగగా వైరా రిజర్వాయర్‌ అలుగు పోస్తోంది. జిల్లాలో బుధవారం సగటు 5.4 సెం.మీ. వర్షపాతం, మధిరలో అత్యధికంగా 11.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే, ఎర్రుపాలెం మండలంలో 9.6, కూసుమంచి మండలంలో 8.2 సెం.మీ. నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది సీజన్‌లో ఇదే పెద్ద వాన కాగా, గత ఏడాది మున్నేటికి వచ్చిన వరదల దృష్ట్యా అధికార యంత్రాంగం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపడుతోంది.

జూలైలో జోరుగా..

ఈ వానాకాలం సీజన్‌లో జూన్‌ నెలలో వరుణుడు కరుణించలేదు. ఆ నెల చివరలో మాత్రం వర్షాలు కురిశాయి. గత ఏడాది జూన్‌లో 12.4 సెం.మీ. గాను 19.7 సెం.మీ. వర్షపాతం నమోదైతే ఈ ఏడాది జూన్‌లో 13.1 సెం.మీకు గాను 12.3 సెం.,మీ.గానే నమోదైంది. ఇక గత జూలైలో 24.9 సెం.మీ. వర్షపాతానికి గాను 30.3 సెం.మీ., ఈ ఏడాది ఇప్పటి వరకు 17.5 సెం.మీ. సగటు వర్షపాతంలో 22.8 సెం.మీ. నమోదు కావడం విశేషం.

ప్రాజెక్టుల్లోకి వరద

నిన్నామొన్నటి వరకు కళ తప్పిన పాలేరు రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ రిజర్వాయర్‌ నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుతం 15 అడుగుల మేర నీరు ఉంది. సాగర్‌ నుంచి వస్తున్న 1,446 క్యూసెక్కులు, చుట్టుపక్కల నుంచి 500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అంతేకాక సాగర్‌ నుంచి ఇన్‌ఫ్లో పెంచనుండడంతో రెండో జోన్‌ ఆయకట్టుకు 1,010 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అలాగే, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు 135 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ఇక వైరా రిజర్వాయర్‌లోకి 1,670 క్యూసెక్కుల వరద వస్తుండగా 18.4 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరి అలుగు పోస్తోంది. లంకాసాగర్‌ ప్రాజెక్టులోకి 192 క్యూసెక్కులు, బేతుపల్లి చెరువులోకి 329 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఎర్రుపాలెం మండలంలోని కట్టలేరుకు 119 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. అయితే, తక్కెళ్లపాడు–బనిగండ్లపాడు మధ్య కల్వర్టుపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. అలాగే, ఖమ్మంలోని ప్రకాశ్‌నగర్‌ చెక్‌డ్యామ్‌, కాల్వొడ్డులోని పాత వంతెన చప్టా వద్ద వరద పెరిగి దిగువకు పారుతోంది. దీంతో అధికారులు మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో వర్షపాతం వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

అధికార యంత్రాంగం సన్నద్ధం..

భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికారులు అన్నివిధాలుగా సన్నద్ధమయ్యారు. గత ఏడాది మూడు గంటల వ్యవధిలోనే 39 సెం.మీ. వర్షపాతం నమోదై మున్నేటిని వరద ముంచెత్తిన విషయం విదితమే. ఈసారి అలాంటి ఉపద్రవం ఎదురైనా ఎదుర్కొనేలా ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆపదలో చిక్కుకున్న వారు ఫోన్‌ చేసేలా టోల్‌ఫ్రీ నంబర్‌ 1077తో కలెక్టరేట్‌లో 24గంటల పాటు కొనసాగేలా కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశారు. అంతేకాక మున్నేరు పరీవాహక ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసి, వరద ముంచెత్తితే తరలించేలా పునరావాస కేంద్రాలను గుర్తించారు.

ముసురుకుంది..

జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న

వర్షాలతో ఎర్రుపాలెం మండలంలోని

కట్టలేరుకు వరద పెరగగా తక్కెళ్లపాడు – బనిగండ్లపాడు మధ్య రాకపోకలు నిలిచాయి. అలాగే, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక నిన్న మొన్నటి వరకు

వెలవెలబోయిన చెరువుల్లోకి నీరు

చేరుతోంది. మొత్తం 984 చెరువులకు గాను 39 అలుగు పోస్తుండగా.. 122 పూర్తిగా, 180 చెరువులు 50 – 75 శాతం మేర నిండాయి.

అంతటా అప్రమత్తం1
1/2

అంతటా అప్రమత్తం

అంతటా అప్రమత్తం2
2/2

అంతటా అప్రమత్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement