
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మం 60వ డివిజన్ రామన్నపేట, దానవాయిగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక దానవాయిగూడెంలో 1, 59, 60డివిజన్ల ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తారు. అనంతరం వైరాలో జరిగే టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మహాసభలో పాల్గొంటారు. ఆతర్వాత ఖమ్మంరూరల్ మండలం గోళ్లపాడు, ఊటవాగుతండా, మంగలిగూడెం, కొత్తూరులో సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
వైద్యసేవలు
ఎలా అందుతున్నాయి?
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని పాలియేటివ్ కేర్(ఉపశమన) సెంటర్‌లో వైద్యసేవలపై డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి ఆరా తీశారు. సెంటర్‌ను బుధవారం తనిఖీ చేసిన ఆమె దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందుతున్న చికిత్స, అందుబాటులో ఉన్న మందుల వివరాలు తెలుసుకున్నారు. అలాగే, వైద్యులు, సిబ్బంది పనితీరుపై సమీక్షించిన ఆమె దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స చేయడమే కాక మానసిక ప్రశాంతత కలిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆతర్వాత అసంక్రమిత వ్యాధులపై అధికారులతో డీఎంహెచ్‌ఓ సమీక్షించారు. జిల్లాలో కేన్సర్, మధుమేహం, బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు, వారికి అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పెద్దాస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్, డిప్యూటీ సూపరింటెండెంట్ కిరణ్, వివిధ విభాగాల వైద్యులు ఎల్.కిరణ్‌కుమార్, రామారావు, ఉద్యోగులు రవికిషోర్, నందగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గడ్డి మందుపై
నిషేధం విధించాలి
లోక్‌సభలో ఎంపీ రఘురాంరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్: పంటల్లో కలుపు నివారణకు వినియోగిస్తున్న అత్యంత విషపూరితమైన పారాక్వాట్ మందును నిషేధించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. పార్లమెంట్‌లో బుధవారం 377 నిబంధన కింద ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. కలుపు నివారణకు ఉపయోగించే ఈ మందును క్షణికావేశంలో తాగుతున్న రైతులు, ఇతరులు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. సరైన చికిత్స లేక పలువురు మృతి చెందుతున్నందున కేంద్రప్రభుత్వం నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, పారాక్వాట్‌కు ప్రత్యామ్నాయ మందు అందుబాటులోకి తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను ఎంపీ కోరారు.
సీజన్‌కు సరిపడా ఎరువులు
కామేపల్లి: ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసే పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య స్పష్టం చేశారు. కామేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎరువుల దుకాణాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ప్రతీ షాప్ వద్ద ఎరువుల స్టాక్ వివరాలతో బోర్డు ఏర్పాటుచేయడమే కాక ప్రతీ అమ్మకాన్ని పీఓఎస్ మిషన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎవరైనా ఎరువులను బ్లాక్ చేయాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అంతేకాక గుళికల యూరియాకు బదులు నానో యూరియా ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, ఎరువుల కొరత ప్రచారంతో రైతులు ఆందోళన చెందవద్దని డీఏఓ తెలిపారు. ఏఓ తారాదేవి, ఏఈఓలు జగదీశ్వర్, జ్ఞాన దీపక్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

నేడు మంత్రి పొంగులేటి పర్యటన