
విద్యాశాఖలో సమస్యలెన్నో...
● ప్రారంభానికి నోచుకోని సైన్స్ మ్యూజియం ● టీచర్ల సర్దుబాటుపై అనుమానాలు ● నేడు విద్యాశాఖపై సమీక్షించనున్న కార్యదర్శి యోగితారాణా
ఖమ్మం సహకారనగర్: జిల్లా విద్యాశాఖ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. గత నాలుగైదేళ్లుగా సరైన పర్యవేక్షణ లేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు సైతం అందటం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
డీఈఓగా అదనపు బాధ్యతలే...
విద్యాశాఖలో కీలక అధికారి అయిన డీఈఓ పోస్టు ఏళ్లుగా ఖాళీగా ఉంటోంది. గతంలో డైట్ లెక్చరర్ సోమశేఖరశర్మ ఎఫ్‌ఏసీ(ఫుల్ అడిషనల్ చార్జి)గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రిటైర్ అయ్యాక డైట్ ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. అయితే, సత్యనారాయణ కూడా ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనుండడం గమనార్హం. దీంతో ఈసారైనా రెగ్యులర్ డీఈఓను నియమిస్తారా, లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అంతేకాక విద్యాశాఖలో మరో కీలక పోస్టు అకడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) పోస్టు సైతం ఖాళీగా ఉండడం విద్యాశాఖ పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తోంది.
ముందుకు సాగని మ్యూజియం
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సైన్స్ మ్యూజియం మంజూరై పదేళ్లు దాటింది. నిధులు కూడా కేటాయించినా ఎడతెగని జాప్యం అనంతరం రెండేళ్ల క్రితం పాత డీఈఓ కార్యాలయంలో ఏర్పాటుచేశారు. అన్ని పరికరాలు సమకూరినా కొన్ని వసతులు లేవని చెబుతూ మ్యూజియంను ప్రారంభించకపోవడం గమనార్హం.
నేడు నాలుగు జిల్లాల అధికారులతో సమీక్ష
విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా బుధవారం ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చారు. తొలిరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించగా గురువారం ఖమ్మం రానున్నారు. పలుచోట్ల పాఠశాలలు, గురుకులాలను తనిఖీ చేయనున్న ఆమె సాయంత్రం 4గంటలకు కలెక్టరేట్‌లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల అధికారులతో విద్యాశాఖపై సమీక్షస్తారు. బడిబాటలో విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయుల సర్దుబాటు, యూనిఫాం పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలపై యోగితారాణా సమీక్షించనున్న నేపథ్యాన అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
అందరికీ అందని యూనిఫాం
విద్యాసంవత్సరం ప్రారంభమై నెలన్నర కావొస్తున్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండో జత యూనిఫామ్ అందలేదు. కొందరికి మొదటి జత కూడా అందలేదని తెలుస్తోంది. అయితే, రెండు జతల యూనిఫామ్‌ను ఈనెల 15వ తేదీ నాటికి ఇవ్వాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇటీవల ఆదేశించినా ఫలితం కానరాలేదు. ఇక ఈ ఏడాది కొత్తగా రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్‌లో పాఠశాలను ప్రారంభించడంతో పాటు గతంలో మూతబడిన వాటిలో 14 స్కూళ్లను తెరిచారు. బడిబాటతో మంచి ఫలితాలు వచ్చాయని, విద్యార్థులు చేరారంటూ ఈ బడులను తెరిచినా.. విద్యార్థులకు గురుకులాల్లో సీట్లు రావడం, కొందరు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లడంతో కొన్ని మూతపడే స్థితికి చేరాయి. ఇక సబ్జెక్టు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రయత్నాలు మొదలుపెట్టినా ఓ కొలిక్కి రాలేదు. ఇంతలోనే పైరవీలు మొదలయ్యాయనే ప్రచారం అర్హులైన ఉపాధ్యాయుల్లో ఆందోళనకు కారణమవుతోంది. వీటన్నింటికీ తోడు జూనియర్లను ఎంఈఓలుగా నియమించారని కొందరు సీనియర్ హెచ్‌ఎంలు ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేయడం జిల్లాలో విద్యాశాఖ పనితీరుకు అద్దం పడుతోంది.