
‘నవోదయ’లో క్లస్టర్ స్పోర్ట్స్ మీట్
హాజరైన వివిధ జిల్లాల
నవోదయ విద్యార్థులు
కూసుమంచి: మండలంలోని పాలేరులో జవహర్ నవోదయ విద్యాలయలో బుధవారం క్లస్టర్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. తొలుత ప్రిన్సిపాల్ కే.శ్రీనివాసులు క్రీడా పతాకాన్ని ఎగురవేయగా, క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సత్తా చాటడం ద్వారా ఉన్నత స్థాయికి చేరొచ్చని చెప్పారు. ఇక్కడ పోటీల్లో ప్రతిభ చాటిన 250మందిని రీజినల్ స్థాయికి ఎంపికచేస్తామని తెలిపారు.
345 మంది క్రీడాకారులు
పాలేరు నవోదయలో మొదలైన క్లస్టర్ స్థాయి పోటీలకు పాలేరుతో పాటు వరంగల్, కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నవోదయ విద్యాలయాల విద్యార్థులు 345 మంది హాజరయ్యారు. ఇందులో 183 మంది బాలురు, 162 మంది బాలికలు ఉన్నారు. వీరికి అండర్–14, 17, 19 విభాగాల్లో బ్యాడ్మింటన్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, ఖో–ఖో, యోగా పోటీలు నిర్వహిస్తుండగా గురువారంతో ముగియనున్నాయి.

‘నవోదయ’లో క్లస్టర్ స్పోర్ట్స్ మీట్