
సంక్రాంతికల్లా మోడల్ మార్కెట్ సిద్ధం
● ఖమ్మంలో సరికొత్త హంగులతో నిర్మాణం ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంవ్యవసాయం: సరికొత్త హంగులతో నిర్మి స్తున్న ఖమ్మం మోడల్ మార్కెట్ సంక్రాంతి నాటికి అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి ఖాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం మార్కెట్‌లోని 15.39 ఎకరాల్లో రూ.155.30 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ మిర్చి మార్కెట్ పనులను సోమవారం మంత్రి పరిశీలించారు. ఈసందర్భంగా పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో చర్చించాక మంత్రి మాట్లాడారు. ఖమ్మం మార్కెట్‌కు మిర్చి సీజన్‌లో లక్షలాది బస్తాల సరుకు వస్తుండడంతో ఇబ్బందులు ఎదురుకాకుండా తాను పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మద్దులపల్లి మార్కెట్‌ను మంజూరు చేయించానని తెలిపారు. ఇప్పుడు ఖమ్మం మార్కెట్‌ను దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దేందుకు నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. తొలుత నిర్మాణ కంపెనీ ప్రతినిధి సురేష్ మోడల్ మార్కెట్ డిజైన్, నిర్మాణ పనుల పరోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ రవికుమార్, వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ డి.వెంకటేశ్వరరావు, ఖమ్మం మేయర్ పి.నీరజ, మార్కెట్ కార్యదర్శి పి ప్రవీణ్‌కుమార్, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
●ఖమ్మంసహకారనగర్: రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో కేంద్రప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయినా రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, బోనకల్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఖమ్మం కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి తుమ్మల పాల్గొన్నారు. వానాకాలం సాగు సక్రమంగా జరిగేలా కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన మొత్తంలో యూరియా అందలేదని, అయినా ఇక్కట్లు రాకుండా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇదేసమయాన బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా అధికారులు తనిఖీలు చేయాలని సూచించారు.
●ఖమ్మంఅర్బన్: జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన వివిధ శాఖల అధికారుల సమావేశమై మాట్లాడారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ ద్వారా ఈనెల 24న అన్ని చెరువులకు నీరు అందించాలని తెలిపారు. అలాగే, అక్కడ సబ్‌స్టేషన్ నిర్మాణం, హైవేలో హైటెన్షన్ లైన్ తొలగింపు, వెలుగుమట్ల అర్బన్ పార్క్‌కు నీరు అందించేలా పైప్‌లైన్ ఏర్పాటు, మార్కెట్ యార్డు సమీపాన రహదారి విస్తరణతో గృహాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్ల కేటాయింపు, నగర మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారీపై సూచనలు చేశారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఆర్‌డీఓ నర్సింహారావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో పాటు జలవనరులశాఖ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఈఈలు అనన్య, బాబూరావు, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.