
మహిళ హత్య కేసులో నిందితుడి రిమాండ్
కొణిజర్ల: మహిళను హతమార్చిన ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు వైరా ఏసీపీ ఎం.ఏ.రెహమాన్ తెలిపారు. వైరా సీఐ సాగర్, కొణిజర్ల ఎస్‌ఐ జి.సూరజ్‌తో కలిసి సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. కామేపల్లి మండలం టేకులపల్లి తండాకు చెందిన భూక్యా మదన్ అదే గ్రామ వాసి, అప్పటికే వివాహమైన భూక్యా హస్లీతో వివా హేతర సంబంధం పెట్టుకుని ఆమెతో కొణిజర్ల మండలం విక్రమ్‌నగర్‌లో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే, హస్లీకి మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి విక్రమ్‌నగర్ సమీపంలోని అఫ్జల్‌తండాకు చెందిన ఇంకో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో గొడవలు జరుగుతుండగా హస్లీని అడ్డు తొలగించేలా ఇద్దరికి రూ.లక్ష సుపారీ ఇవ్వడమే కాక ఈనెల 8న హస్లీని బలవంతంగా సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం సమీప కిష్టారం అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేశారు. అయితే, హస్లీ కనిపించడం లేదని ఆమె కూతురు భూక్యా దేవి ఈనెల 11న ఫిర్యాదు చేయడమే కాక మదన్‌పై అనుమానం ఉందని వెల్లడించింది. దీంతో మదన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేయించినట్లు ఒప్పుకోవడమేకాక ఘటనాస్థలాన్ని చూపించాడు. ఈ మేరకు మదన్‌ను రిమాండ్ తరలించి మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించిన వైరా సీఐ సాగర్, ఎస్‌ఐ సూరజ్, సిబ్బందిని ఆయన అఽభినందించారు.