
వన మహోత్సవానికి పక్కా ప్రణాళిక
● సమన్వయంతో భూసమస్యల పరిష్కారం ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో వన మహోత్సవం విజయవంతం చేసేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం ఆయన రెవెన్యూ, అటవీ భూముల సమస్యలు, వన మహోత్సవం, ప్రభుత్వ గురుకులాల్లో మెనూ అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. వన మహోత్సవంలో భాగంగా మండలాల వారీగా పదెకరాలకు తక్కువ కాకుండా బ్లాక్‌లు గుర్తించి మొక్కలు నాటాలన్నారు. అలాగే, ప్రభుత్వ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ సమస్య రాకుండా మెనూ అమలు, సామగ్రి నాణ్యతపై ఆర్సీఓలు పర్యవేక్షించాలని తెలిపారు. తహసీల్దార్లు ప్రభుత్వ గురుకులాలను వారానికోసారి తనిఖీ చేయాలని, గురుకులాల్లో కమిటీల నిర్వహణపై సూచనలు చేయాలన్నారు. అలాగే, ప్రభుత్వ భూముల పరిరక్షణకు అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
దళారులకు ఆస్కారమివ్వొద్దు...
రెవెన్యూ వ్యవస్థలో దళారులకు ఆస్కారం ఇవ్వకుండా నిబంధనల ప్రకారమే పనులు జరిగేలా అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తిచాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. రెవెన్యూ శాఖపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించిన ఆయన తహసీల్, ఇతర కార్యాలయాల ఉద్యోగులు ప్రజల సమస్యల పరిష్కారంలో ఇతరుల జోక్యాన్ని అరికట్టాలని తెలిపారు. అలాగే, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మీ సేవా కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, రహదారులు, మున్నేరు రిటైనింగ్ వాల్‌కు భూ సేకరణపై కలెక్టర్ సూచనలు చేశారు. డీఆర్‌ఓ పద్మశ్రీ, ఎస్‌డీసీ రాజేశ్వరి, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్ గౌడ్, ఏపీడీ శిరీష పాల్గొన్నారు.