
బయట నో స్టాక్.. లోపల స్టాక్
సత్తుపల్లి: ‘ఎరువులకు కొరతలేదు.. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.. ఏది కావాలంటే అదే ఇవ్వాలి తప్ప ఇతర ఎరువులను లింక్ పెట్టొద్దు’ అని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సత్తుపల్లిలో తనిఖీ సందర్బంగా డీలర్లను హెచ్చరించి 48 గంటలు కూడా గడవలేదు. కానీ డీలర్లు ఎప్పటిలాగే రైతులను ముప్పతిప్పలు పెడుతున్నారు. యూరియా, పొటాష్ నిల్వ లు ఉన్నా లేవంటూ తిప్పి పంపిస్తుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో స్థానిక రైతు మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి శుక్రవారం ఓ షాప్‌లో ఆరా తీయగా స్టాక్ లేదని సమాధానం ఇవ్వడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏఓ శ్రీనివాసరావు తనిఖీ చేయగా సత్తుపల్లిలోని దేవి ఎంటర్‌ప్రైజెస్‌లో 150 బస్తాలు, రైతు ఆగ్రో ఏజెన్సీస్‌లో తనిఖీ చేయగా, దేవి ఎంటర్‌ప్రైజెస్‌లో 48 బస్తాలు ఎంఓపీ నిల్వలు బయటపడడం గమనార్హం.
ధరలు పెరుగుతాయని..
యూరియా, ఎంఓపీ(మ్యూరేట్ ఆఫ్ పొటాష్)కు రైతుల నుంచి డిమాండ్ ఉంది. యూరియా, ఎంఓపీ ధరలను త్వరలోనే పెంచనున్నట్లు తెలిసింది. ఇదే అదునుగా డీలర్లు ఉన్న స్టాక్‌ను బ్లాక్ చేస్తున్నారని సమాచారం. అంతేకాక కొందరు డీలర్లు కాంప్లెక్స్ ఎరువు తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెపుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు సత్పుల్లి ఏఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం స్టాక్ ఉన్న మేర ఎరువులు విక్రయించాలని సూచించారు. ధర పెంచినా, ఇతర ఎరువులతో లింక్ చేసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు.