
వన మహోత్సవానికి రెడీ..
● శాఖల వారీగా మొక్కలు నాటడానికి ఏర్పాట్లు ● 35.23 లక్షల మొక్కలు నాటేలా కార్యాచరణ ● ఎంపిక చేసిన ప్రాంతాల్లో బ్లాక్ ప్లాంటేషన్ కూడా..
ఖమ్మంవ్యవసాయం: మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ, సమతుల్యతకు మొక్కల పెంపకం కీలకంగా నిలుస్తుంది. ఈనేపథ్యాన ప్రభుత్వం ఏటా మాదిరిగానే ఈసారి వన మహోత్సవం పేరిట కార్యక్రమ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది పది ప్రభుత్వ శాఖలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. అటవీ శాఖతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, ఎకై ్సజ్, మున్సిపల్, విద్యాశాఖతో పాటు పరిశ్రమలు, గనులు, భూగర్భ శాఖలకు కార్యక్రమ నిర్వహణ బాధ్యత అప్పగించారు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్న నేపథ్యాన మొక్కలు నాటడం మొదలుపెట్టి ఆగస్టు మొదటి వారానికి పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది.
అటవీ శాఖ ద్వారా 5.47లక్షలు
ఈ ఏడాది వన మహోత్సవంలో జిల్లా అంతటా కలిపి 35,23,300 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో అటవీ శాఖ తరఫున ఖమ్మం డివిజన్ నుంచి 2,47,200, సత్తుపల్లి డివిజన్‌లో 3లక్షలు మొక్కలు నాటాల్సి ఉంది. రిజర్వ్ ఫారెస్ట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ మొక్కలు నాటుతారు. అలాగే, మున్సిపల్ శాఖ ద్వారా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,08,920 మొక్కలు నాటనున్నారు. అంతేకాక మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో 2,41,740 చొప్పున, కల్లూరులో 65వేలు, వైరాలో 50వేలు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 40వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఇంకా మిగతా శాఖలకు కూడా లక్ష్యాలను కేటాయించారు.
మూడు చోట్ల బ్లాక్ ప్లాంటేషన్
జిల్లాలోని పలు ప్రాంతాల్లో బ్లాక్ ప్లాంటేషన్ పేరిట ఒకే చోట ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. అటవీ శాఖ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపడుతారు. ఎంపిక చేసిన ప్రాంతంలో పెద్దసంఖ్యలో నాటి సంరక్షించడం ద్వారా చిట్టడివి మాదిరి తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందుకోసం రఘునాథపాలెం మండలంలో 15 ఎకరాలు, తిరుమలాయపాలెం మండలంలో ఐదు నుంచి ఏడు ఎకరాలు గుర్తించగా, పులిగుండాల వద్ద ఎకోటూరిజంలో భాగంగా 25 ఎకరాల్లో 11,100 మొక్కలు నాటనున్నారు.
సిద్ధంగా మొక్కలు
వన మహోత్సవం కార్యక్రమానికి అవసరమైన మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్, అటవీ శాఖలు ఎన్‌ఆర్‌ఈజీఎస్, హరితనిధి వంటి పథకాల ద్వారా నర్సరీలు నిర్వహిస్తున్నాయి. ఈసారి నీడ, పండ్లు, పూలను ఇచ్చే మొక్కలే కాక ఔషధ మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు చింతచెట్లు, ఈత చెట్లు, చందనం వృక్షాలే కాక నేరేడు, జామ, సీతాఫలం, దానిమ్మ వంటి పండ్ల మొక్కలతో పాటు ఉసిరి, మునగ, గానుగ, నారవేప, రావి, మర్రి, వేప వంటి మొక్కలు సిద్ధం చేశారు.
విద్యార్థుల భాగస్వామ్యం..
ఈ ఏడాది వన మహోత్సవంలో విద్యార్థులను ఎక్కువగా భాగస్వామ్యం చేయనున్నాం. ప్రభుత్వ శాఖలతో పాటు వనసంరక్షణ సమితి సభ్యులు, ప్రజలను కలుపుకుంటూ మొక్కలు నాటుతాం. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నందున త్వరలోనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
– సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా అటవీ అధికారి

వన మహోత్సవానికి రెడీ..