
అంగన్‌వాడీల్లో అరకొర వసతులే..
● సగం కేంద్రాలకే సొంత భవనాలు ● విద్యార్థులు, గర్భిణులకు అనుకూలంగా లేని అద్దె బిల్డింగులు ● టాయిలెట్లు లేక అవస్థలు ● నిధులున్నా.. నిర్మాణాలు లేవు
ఖమ్మంమయూరిసెంటర్ : జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు అరకొర సౌకర్యాలతోనే నడుస్తున్నాయి. సగం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. కొన్ని చోట్ల మంజూరైనా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. చిన్నారులకు పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సేవలు అందించే ఈ కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను ఆయా కేంద్రాలకు పంపించడం లేదు.
అద్దె భవనాలతో అవస్థలు..
జిల్లాలో మొత్తం 1,840 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 940 సెంటర్లకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 900 సెంటర్లలో 440 భవనాలు అద్దె లేకుండా, 460 కేంద్రాలను అద్దె చెల్లించి నిర్వహిస్తున్నారు. ఇక అద్దె భవనాలు చాలా చిన్నగా.. సరైన గాలి, వెలుతురు లేకుండా ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల ఈ భవనాలు కూడా శిథిలావస్థకు చేరాయి. అయినా వాటిలోనే కేంద్రాలను కొనసాగిస్తుండడం గమనార్హం. ఇక ప్రీ స్కూల్‌గా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సరైన ఆహ్లాదకర వాతావరణం ఉండడం లేదు. ఆడుకునేందుకు, సరదాగా కాసేపు బయట తిరిగేందుకు కూడా స్థలం లేక ఒకేచోట కూర్చోవాల్సి వస్తోంది. ఆట వస్తువులు కూడా అందుబాటులో ఉండడం లేదు. ఇక వర్షం వస్తే స్లాబ్‌లు కురుస్తుండగా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.
వసతులూ అంతంతే..
కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి కనీస వసతులు లేకపోవడం అతి పెద్ద సమస్యగా మారింది. మరుగుదొడ్లు ఉన్నా.. పరిశుభ్రత కొరవడుతోంది. సురక్షిత తాగునీరు అందుబాటులో లేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అరకొర సౌకర్యాలతో నడుస్తున్న ఈ కేంద్రాలు తమ పిల్లల ఆరోగ్యానికి, భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని అంటున్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు వైద్య పరీక్షలు, పౌష్టికాహారం కోసం కేంద్రాలకు వచ్చినప్పుడు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు.
నిధులున్నా నిరుపయోగమే..
వివిధ పథకాల కింద అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరవుతున్నాయి. 2024 – 25లో 20, 2025 – 26లో మరో 20 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఏడీఐబీ, డీఎంఎఫ్‌ఏ, ఎమ్మెల్యే కోటా కింద నిధులు విడుదల చేస్తున్నారు. అధికారులు స్థలాలను పరిశీలించి అక్కడ నిర్మించాలని సూచిస్తున్నారు. కానీ ఇప్పటివరకు 40 భవనాలకు నిధులు మంజూరైతే పనులు ప్రారంభించింది నాలుగు మాత్రమే కావడం గమనార్హం.
జిల్లాలో అంగన్‌వాడీ భవనాల వివరాలిలా..
తాగునీటి సదుపాయం లేనివి 296
విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలు 659
టాయిలెట్లు లేని సెంటర్లు 576
మొత్తం విద్యార్థులు 10,094 మంది
బాలురు 5,303
బాలికలు 4,791