
నేడు ములుగు, భద్రాద్రి జిల్లాల్లో తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భద్రాద్రి, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది. సోమవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు ములుగు జిల్లా వాజేడు చేరుకుంటారు. అక్కడ మొక్కజొన్నల రైతులకు మంత్రి సీతక్కతో కలిసి చెక్కులు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బి.జి.కొత్తూరులో మర్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పరిశీలిస్తారు. 3.30 గంటలకు భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కొత్తగూడెం ఐడీఓసీలో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.
గురుకులాల్లో పరిశుభ్రత పాటించాలి
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
కారేపల్లి: గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. కారేపల్లి ఎస్‌ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల భవన సముదాయంలో నిర్వహిస్తున్న వైరా మైనారిటీ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. వసతులపై ఆరా తీశారు. విద్యార్థినులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నారా.. స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో వచ్చిన ఫలితాలు, విద్యార్థినుల ప్రగతిని తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కారేపల్లిలో నిర్వహిస్తున్న మైనార్టీ బాలికల గురుకులాన్ని ఖమ్మం, వైరా పట్టణాల సమీపంలోకి తరలిస్తున్నారనే వార్తలు రావడం, అదనపు కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
అనర్హులతో డీసీఈబీ
సెక్రటరీ పోస్టు భర్తీ
హెచ్‌ఎంల అసోసియేషన్ ఆరోపణ
ఖమ్మం సహకారనగర్ : డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) సెక్రటరీ పోస్టును అర్హత లేని వారితో భర్తీ చేశారని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.వీరస్వామి, టి.నాగేశ్వరరావు ఆరోపించారు. నగరంలోని ఇందిరానగర్ పాఠశాలలో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ డీసీఈబీ సెక్రటరీ ఎంపికలో నిబంధనలను తుంగలో తొక్కారని అన్నారు. బోర్డును రద్దు చేసినట్లు డీఈఓ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాజాగా నియమించిన సెక్రటరీపై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయని, అలాంటి వ్యక్తిని మళ్లీ ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సమావేశంలో హెచ్‌ఎంలు రాయల శ్రీనివాసరావు, చావా శ్రీనివాసరావు, చిరంజీవి నాయుడు, ఆర్.వెంకటరావు, వి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు ములుగు, భద్రాద్రి జిల్లాల్లో తుమ్మల పర్యటన