సీజనల్ వ్యాధుల కట్టడి, వరద నివారణకు ప్రణాళికలు
రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు
భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో మలేరియా, చికున్‌గున్యా లేవు. గత ఏడాది డెంగీ కేసులు నమోదైనందున ఈసారి పునరావృతం కాకుండా ప్రణాళికా యుతంగా వ్యవహరిస్తున్నాం. గత ఏడాది మున్నేటి వరదల దృష్ట్యా ఈసారి ముందస్తు రక్షణ చర్యలపై దృష్టి సారించాం. వ్యవసాయ పనులు ప్రారంభమైనందున రైతులకు ఎరువులు, విత్తనాలు సమకూర్చగా.. భూభారతి సదస్సుల్లో అందిన 75 వేల దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.
వచ్చేనెల 1నుంచి వన మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాక జిల్లాలో అందరికీ మెరుగైన విద్య, వైద్యం అందేలా కార్యచరణ రూపొందించాం’ అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనుదీప్ తొలిసారి మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే...
● హాట్‌స్పాట్లను గుర్తిస్తున్నాం..
జిల్లాలో మలేరియా, చికున్‌గున్యా లేకపోగా.. గత ఏడాది డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తిరుమలాయపాలెం తదితర ప్రాంతాల్లో ఈ కేసులు అధికంగా వచ్చాయి. ఆయా ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశిం చాం. ఫ్రైడే– డ్రైడే ద్వారా ఇంటింటా అవగాహన కల్పిస్తాం. డ్రెయిన్లు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా, ఆయిల్‌బాల్స్ వేయిస్తాం. ఆశాలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేసి అనుమానితులకు పరీక్షలు చేస్తారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ, చికున్‌గున్యా కేసులు నమోదైతే వెంటనే సమాచారం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తాం.
● ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు అవగాహన
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇప్పటికే 12వేల మందికి ఇళ్లు మంజూరు చేశాం. కొన్ని ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇళ్లు మంజూరైన ప్రజలు సంతోషంగా ఉన్నారు. నేను రెండు గ్రామాలు పరిశీలించగా ఇసుక కొరత ఉందని చెప్పారు. దీంతో కూపన్ల ద్వారా ఇసుక పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. మంజూరైన ఇళ్లు త్వరగా కట్టుకోవాలని అవగాహన కల్పిస్తూనే ఎప్పటికప్పుడు నగదు జమ అయ్యేలా పర్యవేక్షిస్తున్నాం.
● 15 ఎకరాల్లో అవెన్యూ ప్లాంటేషన్
వచ్చేనెల 1వ తేదీ నుంచి వన మహోత్సవం ప్రారంభమవుతుంది. అప్పటిలోగా వర్షాలు జోరందుకుంటాయని భావిస్తున్నాం. 10 – 15 ఎకరాల విస్తీర్ణంలో అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటుకు నిర్ణయించాం. ఇందుకోసం తిరుమలాయపాలెం, రఘునాథపాలెం మండలాల్లో స్థలాలను గుర్తించాం. అక్కడ మొక్కలు నాటి సంరక్షిస్తూ చిట్టడవిని తలపించేలా తీర్చిదిద్దుతాం. అన్ని ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేస్తాం.
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి పెట్టాం. పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాల మరమ్మతులకు అంచనాలు సిద్ధమవుతున్నాయి పాఠశాలల్లో పారిశుద్ధ్యం బాగుండేలా చూస్తున్నాం. ప్రతీ విద్యార్థికి పౌష్టికాహారం అందిస్తూనే వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులకు కేఎంసీ సిబ్బందిని సమకూర్చాం. రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రి కార్మికులకు వేతనాలు అందేలా చూస్తాం.
కారణాలు వివరిస్తాం..
భూభారతి సదస్సుల్లో 75 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొన్నింటిని పరిశీలించాం. దరఖాస్తులన్నీ క్షుణ్ణంగా పరిశీలించాక సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తున్నాం. ఒకవేళ ఏదైనా దరఖాస్తును పరిష్కరించలేకపోతే అందుకు కారణాలను దరఖాస్తుదారుడికి వివరిస్తాం. సాదాబైనామా దరఖాస్తులపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.
వరదలపై అవగాహన కల్పిస్తున్నాం..
గత ఏడాది వచ్చిన వరదను దృష్టిలో పెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించడమే కాక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించా. ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగానే పునరావాస కేంద్రాలను గుర్తిస్తున్నాం. ఎగువ ప్రాంతాల్లో వరదలు మొదలుకాగానే సమాచారం ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించాం. అలా సమాచారం రాగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తాం. అంతేకాక వానాకాలం రెండు నెలలు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఇక్కడే ఉండి ఆపద ఎదురుకాగానే రంగంలోకి దిగనుంది.
సరిపడా విత్తనాలు, ఎరువులు
ఈ వానాకాలం సీజన్‌లో అన్నీ కలిపి 6.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. ఇందులో 3లక్షల ఎకరాల్లో వరి, 2.25 లక్షల ఎకరాల్లో పత్తి, 65 వేల ఎకరాల్లో మిర్చి సాగవుతుందని భావిస్తున్నాం. ఇందుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అన్ని షాపుల్లో అమ్మకాలను ప్రతిరోజు ఆరా తీస్తున్నాం. ఏఈఓ మొదలు జిల్లా అధికారుల వరకు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నందున డీలర్లు అవకతవకలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.
అప్రమత్తంగా ఉన్నాం..


