మున్నేటి వరద నియంత్రణకు కార్యాచరణ
ఖమ్మంఅర్బన్/కూసుమంచి: మున్నేరు నదికి వచ్చే వరదను ముందస్తుగా గుర్తించి, ముప్పు ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈమేరకు ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను గురువారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం, నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. మున్నేటి వరద ముప్పును అంచనా వేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన, సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశాలపై చర్చించారు. గత ఏడాది వరదల నేపథ్యాన ఈసారి ముందుగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. జలవనరుల శాఖ ఈఈ అనన్య, డీఈ ఉదయ్‌ప్రతాప్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం హెడ్ గౌతమ్, సభ్యులు పాల్గొన్నారు. కాగా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం అధికారులు కూసుమంచి మండలంలోని పాలేరు, నాయకన్‌గూడెం గ్రామాల్లో పర్యటించారు. గత ఏడాది పాలేరు రిజర్వాయర్‌కు వరద ముంచెత్తగా ఎదురైన నష్టాన్ని పరిశీలించి అప్పట్లో ధ్వంసమైన ఇళ్ల ఆనవాళ్లను పరిశీలించారు. ఈమేరకు అధికారికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. తహసీల్దార్ రవికుమార్, ఎంపీఓ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
పరిశీలించిన ఎన్‌డీఆర్‌ఎఫ్,
నీటిపారుదల శాఖ అధికారులు


