
ప్రారంభానికి ముస్తాబు
● పాఠశాలల్లో చివరి దశకు అభివృద్ధి పనులు ● బడి మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా పర్యవేక్షణ ● తద్వారా తీరనున్న విద్యార్థుల ఇక్కట్లు
పనులపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులు విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి పూర్తి చేసేలా పర్యవేక్షిస్తున్నాం. అదనపు కూలీలను సమకూర్చుకుని పనులు వేగంగా చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. మా ఉద్యోగులు కూడా నిరంతరం పరిశీలిస్తున్నారు.
– సామినేని సత్యనారాయణ, డీఈఓ
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో అన్ని వసతులు సమకూర్చేలా మంజూరైన నిధులతో చేపట్టిన పనులు చకచకా కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం(2022–23) హయాంలో మన ఊరు –మన బడి, మన బస్తీ –మన బడి ద్వారా జిల్లాలోని 426 పాఠశాలలను ఎంపిక చేసి సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మిగతా పాఠశాలల్లో అవసరమైన వసతులు కల్పిస్తోంది.
పనులు ఇలా..
2022–23లో మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి కింద 426 పాఠశాలలను ఎంపిక చేయగా.. 275 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా 151 పాఠశాలలను ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కిందకు చేర్చారు. మొత్తంగా 955 పాఠశాలల్లో అమ్మ ఆదర్శపాఠశాలల పథకం ద్వారా పనులు పూర్తి చేయాలని నిర్ణయించి రూ.35 కోట్లు కేటాయించింది. ఈ నిధుల ద్వారా 895 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. దీంతో సుమారు రూ.23 కోట్ల బిల్లులు చెల్లించారు. మిగిలిన 60 పాఠశాలల్లోనూ పనులు చివరి దశకు చేరగా విద్యాసంవత్సరం మొదలయ్యేలా నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా, పాఠశాలల్లో ప్రధానంగా అదనపు తరగతి గదులు, ప్రహరీలు, టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్ మరమ్మతులు తదితర పనులపై దృష్టి సారించారు.
అన్ని సౌకర్యాలు
కొత్త విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి పాఠశాలల్లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కాంట్రాక్టర్లకు సూచనలు చేస్తున్నారు. దీంతో విద్యుత్ వైర్లు, పెయింటింగ్, ప్రహరీల నిర్మాణం, చిన్న చిన్న మరమ్మతులు చకచకా సాగుతున్నాయి. ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం 14 కేజీబీవీల్లో సైతం సౌకర్యాలు కల్పించేందుకు రూ.5కోట్లు కేటాయించగా, అక్కడ కూడా పనులు వేగంగా చేయిస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరుతాయని చెబుతున్నారు.

ప్రారంభానికి ముస్తాబు