
విద్యుత్ ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరిస్తున్నాం
ఖమ్మంవ్యవసాయం: ప్రతీ సోమవారం నిర్వహించే విద్యుత్ ప్రజావాణిలో అందుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఖమ్మంలోని సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులు స్వీకరించాక మాట్లాడారు. ఇప్పటివరకు 201 ఫిర్యాదులు అందగా, 195 సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు. బిల్లుల్లో హెచ్చుతగ్గులు, మీటర్ల సమస్యలు, సరఫరాలో అవాంతరాలు, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, లైన్లపై ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. సర్కిల్ కార్యాలయంతో పాటు డివిజన్, ఈఆర్వో, సెక్షన్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదులు ఇవ్వొచ్చని ఎస్‌ఈ వివరించారు.